తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటూ ఉండగా అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని, విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి కనిపించక పోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది కానీ సినిమా రివ్యూ ప్రక్రియ పూర్తయినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా అందలేదు. ఈ లేట్ కావాలనే చేస్తున్నారు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read:Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపనైన మీను..!
సినిమా యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, గత నెలలోనే సినిమాను సెన్సార్ బోర్డు వీక్షించి కొన్ని సూచనలు, కట్స్ చెప్పింది, బోర్డు సూచించిన మార్పులు (Cuts) మరియు మ్యూట్లను కూడా చిత్ర బృందం పూర్తి చేసి మళ్ళీ సమర్పించింది. అయినప్పటికీ, సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉండవచ్చని విజయ్ పార్టీ (TVK) వర్గాలు ఆరోపిస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటేనే థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు లేదా రేపటిలోగా సర్టిఫికేట్ రాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేసిన గ్రాండ్ రిలీజ్ వాయిదా పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ మరియు ఓవర్సీస్‌లో బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో సెన్సార్ అడ్డంకుల వల్ల బుకింగ్స్ నిలిచిపోయాయి.
Also Read:Chiranjeevi: సంక్రాంతి ముందే ‘మెగా’ సునామీ: లక్షల్లో చిరు సినిమా టికెట్లు!
సెన్సార్ బోర్డు నుంచి స్పష్టత రాకపోవడంతో చిత్ర బృందం అత్యవసర విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించి, సర్టిఫికేట్ జారీలో జాప్యం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఇచ్చే తీర్పుపైనే ‘జన నాయగన్’ విడుదల భవితవ్యం ఆధారపడి ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఒకవేళ కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తే, రేపటి నుంచి బుకింగ్స్ ఊపందుకుంటాయి. లేదంటే పండుగ రేసు నుంచి విజయ్ తప్పుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు.