ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో? సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ కుర్చీని ఫ్రెండ్ వరద రాజ మన్నార్‌కు ఇస్తానని మాటిచ్చిన దేవరథ.. శౌర్యాంగ తెగ కోసం ఏం చేశాడు? మన్నార్ తెగ పై పగ తీర్చుకున్నాడా? అసలు ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారు? ఇలాంటి ఎన్నో డౌట్స్‌ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 1లో వదిలేసిన చాలా ప్రశ్నలకి శౌర్యంగ పర్వంలో సమాధానాలు చెప్పబోతున్నాడు. ముఖ్యంగా రాజ మన్నార్ కూతురు రాధా రమ, దేవరథపై ఎందుకంతలా రగిలిపోతోంది? అనేది అంతు బట్టకుండా ఉంది. దీంతో సలార్ 2లో విలన్‌గా శ్రియ రెడ్డి పాత్ర హైలెట్‌గా నిలిచేలా ఉంది. తాజాగా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేసింది శ్రియా రెడ్డి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్ట్ 2లో తన పాత్ర మరింత బలంగా ఉంటుందని.. పార్ట్ 2 కథ మొత్తం ఖాన్సార్ రాజ్యంలోనే నడుస్తుందని తెలిపింది.
దేవరథ, వరదరాజ మన్నార్ మధ్య వైరం సృష్టించడానికి రాధా రమ ఎలాంటి వ్యూహాలు వేసింది? అనేది పార్ట్ 2లో చూపించనున్నారట. దీంతో శౌర్యాంగ పర్వంలో ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి పాత్రల మధ్యనే ప్రధాన సంఘర్షణ ఉంటుందని తెలుస్తోంది. అలాగే శౌర్యంగ వంశానికి చెందిన బాబీ సింహా క్యారెక్టర్ కూడా బలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ప్రాణ స్నేహితులు ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే సీన్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మామూలుగా ఉండవని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ జస్ట్ శాంపిల్ అని చెబుతున్న మేకర్స్… సెకండ్ పార్ట్‌లోనే అసలు కథ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే శౌర్యంగ పర్వం మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. మరి సలార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.