తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస్తే కంటెస్టెంట్స్ పరంగా ఆసక్తి తగ్గుతూ వచ్చిందన్నది వాస్తవం. అయితే లక్కీగా నాలుగు, ఐదు సీజన్స్ టైమ్ లో కరోనా కారణంగా లాక్ డౌన్ వంటి కారణాలతో జనాలు షోను చూడక తప్పని పరిస్థితి ఎదురయింది. దాంతో మరో రెండు నెలల్లోనే బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుందని నాగ్ 5వ సీజన్ ముగింపులో ప్రకటించాడు.
ఇదిలా ఉంటే తొలి సీజన్ లో ఇమేజ్ ఉన్న సినీ, టీవీ, సోషల్ మీడియా రంగాల వారు ఈ రియాలిటీ షోలో పాల్గొన్నారు. దాంతో ఆడియన్స్ స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. వారిలో శివబాలాజీ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక రెండో సీజన్ లో ఫర్వాలేదనిపించే ఇమేజ్ ఉన్న వారు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. కొన్ని మలుపుల తర్వాత కౌశల్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ గెలుపుకు అతని ఆర్మీ కారణమని చెప్పవచ్చు. దాదాపు పోలైన ఓట్లలో సగానికిపైగా అతనికే వచ్చాయంటే అతగాడి ఆర్మీ ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పవచ్చు. ఇక మూడో సీజన్ లో సోషల్ మీడియా ప్రభావం మరింతగా పని చేసిందని చెప్పాలి. పోటీతత్వంతో ఓటింగ్ జరగటం ఈ సీజన్ నుంచే మొదలైంది. ఎట్టకేలకు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. నాలుగో సీజన్ పూర్తి లాక్ డౌన్ లో జరగటంతో ఆరంభంలో ఏ మాత్రం బజ్ లేదనిపించుకున్న ఈ రియాలిటీ షో క్రమేపి క్రేజ్ పెంచుకుని ముగింపుకు వచ్చే సరికి మంచి రేటింగ్ తో ముగిసింది. అభిజిత్ విజేతగా నిలిచాడు. అయితే ఈ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన అఖిల్, మూడో స్థానంలో నిలిచిన సోహైల్ తమ ఆటతీరుతో పాటు ఛారిటీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
ఈ ఏడాది ఐదో సీజన్ ఆరంభం అయినపుడు ఎప్పుడూ లేని విధంగా తక్కువ స్థాయి రేటింగ్ ని సాధించింది. అంతే కాదు పోటీదారులను చూసి కూడా చాలా మంది పెదవి విరిచారు. నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లు ఈ సీజన్ సాగింది. అయితే ఈ రియాలిటీ షోపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చాలా వరకూ కాపాడిందనే చెప్పాలి. గ్రాండ్ ఫినాలే కు అతిథులు క్యూ కట్టినా అంత ఆసక్తికరంగా అనిపించలేదన్నది చూసిన వారి మాట. దీని రేటింగ్ ఏమిటన్నది మరి కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ముందు నాలుగు సీజన్స్ లో విజేతలుగా నిలిచిన వారికి కానీ, ఇందులో పాల్గొన్నవారికి కానీ బిగ్ బాస్ క్రేజ్ అంతగా ఉపయోగపడలేదన్నది అందరూ ఎరిగిన సత్యం. ఈ ఏడాది ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి సినిమా ఆఫర్లు పలకరించటం గుడ్డిలో మెల్ల.
ఒక్కటి మాత్రం నిజం పోటీదారుల్లో సహజమైన పోటీ పక్కకు వెళ్ళి ఎంత ఖర్చు పెట్టయినా విజేత అనిపించుకోవాలనే తపన, కసి పెరిగిపోతోంది. దాంతో ఒక్కక్కరూ లక్షలకు లక్షలు వెదజల్లుతూ ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ లోకి వెళ్ళకముందే డీల్స్ కుదుర్చుకుంటున్నారు. 5వ సీజన్ లో ఒకరిద్దరు పోటీదారులు పది లక్షలనుంచి 15 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు అనధికారిక సమాచారం. దీనివల్ల కంటెస్టెంట్స్ లో అసూయ, ద్వేషాలు పెరుగుతాయన్నది పరిశీలకుల అభిప్రాయం. పోటీదారులు పోటీతత్వం పీక్స్ కి వెళ్ళటంతో నిర్వాహకులు కూడా మరో రెండు నెలలలోనే సీజన్ 6 ఆరంభించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రకటించారు. మరి రాబోయే సీజన్ లో సందడి చేయబోయే పోటీదారులెవరు? వారికి ఎలాంటి ఆదరణ దక్కుతుందన్నది వేచి చూడాల్సిందే.