యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు ఎందరో. పతంజలి మహర్షి ప్రతిపాదించిన లక్షకు పైగా యోగసూత్రాలను తరువాత ఎందరో సంక్షిప్తం చేస్తూ, నవీన సమాజానికి తగిన యోగాభ్యాసాలను, ధ్యాన మార్గాలనూ సూచించారు. వీటిని తు.చ. తప్పక పాటించిన వారి తీరే మారిపోతుందని పెద్దల మాట! మన సినిమా రంగంలో యోగసాధనతోనే తమ యోగాన్ని మార్చుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇక యన్టీఆర్, ఎమ్జీఆర్, కన్నడ రాజ్ కుమార్ వంటివారు యోగసాధనతోనే అంతటి స్టార్ డమ్ సంపాదించారని చాలామంది చెబుతారు. తరువాతి రోజుల్లోనూ ఎంతోమంది యోగసాధన చేయడంతోనే చిత్రసీమలో రాణించామనీ స్వయంగా సెలవిచ్చారు. ఇలా మన తారల తీరును మార్చివేయడంలో యోగా ప్రధాన పాత్ర పోషించిందనీ చెప్పవచ్చు. ఈ విశేషాలు తెలుసుకున్న హాలీవుడ్ స్టార్స్ కొందరు భారతదేశం వచ్చి, కేరళలో ఆయుర్వేద వైద్యం తీసుకోవడంతో పాటు, యోగసాధన కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతకాలంగా మన తారలు భలేగా సందడి చేశారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఆ సందడి అంతగా సాగలేదు.
యన్టీఆర్ – యోగసాధన…
ఇక మన తెలుగు సినిమా విషయానికి వస్తే – చిత్రసీమలో రాణించిన వారందరూ ఏదో ఒక సందర్భంలో యోగసాధన చేసిన వారేనని చెప్పవచ్చు. ఆల్ ఇండియాలోనే తొలి సూపర్ స్టార్ గా నిలచిన మహానటుడు చిత్తూరు వి.నాగయ్య ‘యోగా’ను ఆశ్రయించి, సమాధి స్థితిని సైతం చూశారట! తరువాత సన్యాసం పుచ్చుకోవాలని చూశారు. అయితే కొందరి మిత్రుల ప్రేరణతో మళ్ళీ నాటకరంగంలో రాణించి, ఆ తరువాత చిత్రసీమలో ఓ వెలుగు వెలిగారు. యన్టీఆర్ చదువుకొనే రోజుల్లోనే ఆయన గురువులు ఆయనకు యోగాభ్యాసం విశిష్టతను చాటిచెప్పారు. అప్పటి నుంచీ బ్రాహ్మీముహూర్తంలో లేవడం, కాలినడకనే రైల్వే స్టేషన్ కు వెళ్ళి, ట్రెయిన్ ఎక్కి విజయవాడలో చదువుకోవడం, ఆ తరువాత గుంటూరులోనూ డిగ్రీ చదవడం సాగాయి.
యోగాభ్యాసంతో ఆయనకు ఎంతో సంతోషం కలిగేది. ఒక్క రోజు కూడా యోగసాధన చేయకుండా ఉండలేకపోయేవారు. యోగాభ్యాసమే కాదు, ప్రాణాయామ, ధ్యానంలోనూ యన్టీఆర్ సాధన చేసేవారు. అందుకే అరవై ఏళ్ళ వరకూ ఆయన అందంగానే కనిపిస్తూ వచ్చారు. ఇక అనితరసాధ్యమైన రీతిలో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాల్లో అలరించారు. బ్రాహ్మీముహూర్తం అంటే తెల్లవారు జామున 3 గంటలకు నిద్రలేచి, తరువాత యోగసాధన చేశాకే, ఇష్టదైవ ప్రార్థన పూర్తి చేసుకొని ఏడుగంటల కల్లా షూటింగ్ కు రెడీ అయ్యేవారు. సాయంత్రం ఏడు గంటలవరకు, అవసరమయితే మరిన్ని గంటలు పనిచేసినా, ఆయన చెక్కుచెదరకుండా ఉండేవారు. అందుకు యోగసాధనే ఉపకరించిందని యన్టీఆర్ పలుమార్లు స్వయంగా చెప్పారు.
అనితరసాధ్యమైన విజయాలకు…
ముఖ్యంగా పౌరాణిక, జానపదాలు అంటే ‘క్యాస్ట్యూమ్ డ్రామాస్’. వాటిలో రకరకాల గెటప్స్, అందుకు తగ్గ ఆభరణాలు వేసుకొని, గంటల కొద్దీ వాటిని భరిస్తూ సమాసభూయిష్టమైన సంభాషణలు వల్లిస్తూ నటించడమంటే మాటలు కాదు. ఇప్పటిలా అప్పట్లో ఒక్కో సినిమాను సంవత్సరాల పాటు తీసేవారు కాదు. పైగా ఆ రోజుల్లో స్పాట్ రికార్డింగ్ ఉండేది. ఓ డైలాగ్ తప్పు పోతే, మళ్ళీ రీటేక్ తీసుకుంటూ చెప్పాలి. శరీరంపై పాత్రకు తగ్గ ఆభరణాల మోత కూడా తప్పదు. అయితే రామారావు అలవోకగా అనేక పురాణపాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అదే తీరున జానపదాల్లో పలు వేషాలు వేసి అలరించారు. వీటన్నిటికీ యోగసాధనే కారణమని రామారావు సన్నిహితులు సైతం చెబుతారు. ఆయన కృషి, దీక్ష, పట్టుదలకు యోగానే కారణమని, అందుకే అనితరసాధ్యమైన విజయాలు ఆయనను చేరాయని విశ్లేషించేవారు ఎందరో!
ఆ ముగ్గురు…
తమిళనాట ఎమ్జీఆర్ కూడా శరీరాన్ని యోగసాధనతోనే తన అదుపాజ్ఞలలో ఉంచుకొనేవారు. ఆయన పలు ప్రమాదాలను ఎదుర్కొన్నా, మృత్యుంజయునిగా నిలవడానికీ యోగసాధనే కారణమని తమిళ జనం అంటారు. ఇక కన్నడ నాట నటకంఠీరవునిగా సాగిన రాజ్ కుమార్ హఠయోగసాధనతో ఆకట్టుకున్నారు. యన్టీఆర్ తాను నటించిన ‘రేచుక్క – పగటిచుక్క, లక్షాధికారి’ వంటి చిత్రాలలో యోగసాధన ఎంతో అవసరమని చెప్పినట్టుగానే, రాజ్ కుమార్ కూడా తాను నటించిన కొన్ని చిత్రాలలో క్లిష్టమైన యోగాసనాలు వేసి, యోగ ప్రక్రియలు ఎలా చేయాలో కూడా చూపించారు. ఇలా దక్షిణాదిన రామారావు, రామచంద్రన్, రాజ్ కుమార్ ముగ్గురూ ‘డెమీ గాడ్స్’గా వెలగడానికి వారు చేసిన యోగసాధనే కారణమని అంటారు.
వారి బాటలోనే…
యన్టీఆర్, ఎమ్జీఆర్, రాజ్ కుమార్ చూపిన మార్గంలోనే తరువాతి తరం హీరోలు సైతం యోగసాధన చేస్తున్నారు. తెలుగునాట చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ ఈ నాటికీ ఉదయాన్నే చేసే వ్యాయామంలో యోగాసనాలను చేస్తూనే ఉన్నారు. నవతరం నాయకులు సైతం వారి బాటలోనే పయనిస్తూ యోగాభ్యాసం చేస్తున్నారు. ఇక ఎంతోమంది అందాల భామలు తమ సౌందర్యాన్ని పరిరక్షించుకోవడానికి యోగసాధననే మార్గంగా ఎంచుకున్నారు. అందాల తారల యోగాను దృష్టిలో పెట్టుకొనే కె.రాఘవేంద్రరావు తన ‘అల్లరి మొగుడు’ సినిమాలో “భమ్ చిక భమ్ చెయ్యి బాగా… వంటికి యోగా మంచిదేగా…” అంటూ మోడరన్ యోగా స్టైల్స్ తో కనువిందు చేశారు. ఈ తరం కుర్ర భామలు యోగాతో పాటు, జిమ్ లోనూ సందడి చేస్తున్నారు. నిజానికి జిమ్ లో భారీ బరువులు మోయాలంటే, యోగసాధనలో పట్టు సాధిస్తే సులభమవుతుంది. అదే తీరున పలువురు భామలు సాగుతున్నారు.
ఇక పొడుగు కాళ్ల సుందరిగా పేరొందిన శిల్పా శెట్టి యోగా చేయడమే కాదు, ఎలా చేయాలో చూపిస్తూ సోషల్ మీడియాలో ఏ నాటి నుంచో సందడి చేస్తోంది. నవతరం భామల్లో రశ్మిక సైతం యోగసాదనలో పట్టువుందని పలు వీడియోల ద్వారా చాటింపు వేసింది. ‘భీష్మ’ చిత్రంలో ఉత్తాన పద్మాసనంలో ఉడికించింది కూడా. ఇలా యోగం సినిమా తారలకు భోగం చూపిస్తోంది. వారిలో ఆధ్యాత్మిక భావాలకూ అంకురార్పణ చేస్తోంది. సాటి మనిషిని ఆదుకోవడానికి వారిలో సేవాభావాన్ని సైతం యోగసాధన కలిగిస్తోందని చెప్పవచ్చు. కరోనా కాలంలోనూ పలువురు తారలు దాని బారిన పడ్డా, త్వరితగతిన కోలుకోవడానికి యోగానే కారణమయిందని తెలుస్తోంది. ఏది ఏమైనా యోగసాధనతో ఆరోగ్యంతో పాటు, ఆనందం, దానితో పాటు ఆధ్యాత్మిక వికాసమూ ఒనకూరుతుందని తేటతెల్లమయింది. కావున, అందరూ అంతర్జాతీయ యోగాదినోత్సవాన కాసేపు యోగసాధన చేస్తే మంచిదేగా!