హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు.
వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో పాటు ఊరికి తీసుకొచ్చిన వాసుకు అగ్రహారంలో అవమానం ఎదురవుతుంది. గిరిజన మహిళను అతను పెళ్ళి చేసుకోవడాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులు ఇంటి నుండి, ఊరి నుండి వారిని వెలివేస్తారు. భార్యను తీసుకుని కట్టుబట్టలతో ఊరి వదిలి వెళ్ళిన వాసు, ఇందుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్ర కథ.
పల్లె అయినా, గూడెం అయినా కొన్ని కట్టుబాట్లతో నడవాల్సిందే! దానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సిందే. వాళ్ళను ఎదిరించి పెళ్ళి చేసుకున్న వారి జీవితాలు ఎలాంటి విషాదాంతాలుగా మారిపోతాయో మనం చాలా సినిమాలలో చూశాం. ఇదీ అదే కోవకు చెందిన చిత్రమే. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్న కొడుకును ఏమీ చేయలేక కోడలిని హతమార్చడం, ఆ విషయం తెలిసి ఆమె భర్త సైతం దారుణానికి ఒడిగట్టడం, అందుకు కారకులైన వారిపై పగ ప్రతీకారాలు తీర్చుకోవడం… ఇలా ఓ రొటీన్ ఫార్ములాను ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజు అనుసరించాడు. దాంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కొత్తదనం లేక నత్తనడకలా సాగుతుంటుంది.
ఫారెస్ట్ ఆఫీసర్ గా వరుణ్ సందేశ్, గిరిజన యువతి ఫర్నాజ్ శెట్టి నటించారు. తెర మీద వరుణ్ సందేశ్ ను చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఎక్కడా అనిపించడు. ఇక ఫర్నాజ్ ను గ్లామర్ డాల్ గా తెరపై చూపించే ప్రయత్నం చేశారు తప్పితే, గిరిజన మహిళ అనే భావన మనకు ఎక్కడా కలగదు. ఇక ఫారెస్ట్ అధికారులుగా నటించిన ధనరాజ్, పార్వతీశం, మహేశ్ విట్ట, ‘జెర్సీ’ మోహన్ మనకు కమెడియన్లుగానే కనిపిస్తారు తప్పితే, వాళ్ల పాత్రలు కనిపించవు. హీరో తండ్రిగా నాగినీడు, పిన్నిగా సురేఖ వాణి నటించారు. ఆమె కూతురుగా ‘కార్తీక దీపం’ ఫేమ్ బేబీ కృతిక నటించింది. రఘుబాబు, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేశ్, వంశీ కృష్ణ ఆకేటి, జ్యోతి, సురేఖా వాణి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మంత్రగాడుగా అలీ కాసేపైనా నవ్విస్తాడు అనుకుంటే అందుకు భిన్నంగా చికాకు పుట్టించాడు. ఇలాంటి హారర్ మూవీస్ లో లాజిక్ ను వెతకలేం. అలా అని మరీ అడ్డదిడ్డంగా కథను నడిపిస్తే తట్టుకోవడమూ కష్టమే. కనీసం కామెడీని అయినా సక్రమంగా పండించారా అంటే అదీ లేదు. అనుభవం ఉన్న నటీనటులు ఉన్నా వారిని ఉపయోగించుకోవడంలో దర్శకుడు, రచయిత దారుణంగా విఫలమయ్యారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీశ్ ఆకేటి అందించాడు. మరి అతనే మెగా ఫోన్ ఎందుకు పట్టుకోలేదో అర్థం కాదు. ఇందులో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే…. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ, శివ కాకాని నేపథ్య సంగీతమే. ఒకటి రెండు పాటలకు ఓల్డ్ ట్యూన్సే వాడారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు సీనియారిటీ కూడా ఈ సినిమాను ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టకుండా కాపాడలేకపోయింది. రెండేళ్ళ క్రితం ‘నువ్వు తోపురా’లో కీలక పాత్ర పోషించిన వరుణ్ సందేశ్ ఓ రకంగా ‘ఇందువదన’తో రీ-ఎంట్రీ ఇచ్చాడనే అనుకోవాలి. కాస్తంత టైమ్ పట్టినా… ఓపికతో మంచి కథను, మంచి టీమ్ ను ఎంపిక చేసుకుని అతను మూవీ చేసి ఉండాల్సింది. ఏ రకంగానూ ఈ ‘రీ-ఎంట్రీ’ అతనికి అచ్చిరాలేదు!
ప్లస్ పాయింట్స్
మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ
శివ కాకాని నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనాలు
పండని హాస్యం
ఊహకందే ముగింపు
రేటింగ్: 2 / 5
ట్యాగ్ లైన్: అడవి కాచిన వెన్నెల!