యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది ఓ ప్రత్యేక శైలి. అలానే ‘సింగం’ మూవీ నుండి కాప్ యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అలా వచ్చిన ‘సింగం రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘సింగం -3’ కూడా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో సిద్ధార్థ్ మల్హోత్రాతో అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సీరిస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ బుధవారం విడుదలయ్యాయి. ఈ వెబ్ సీరిస్ మేకింగ్ కు సంబంధించిన విశేషాలతో టీజర్ సాగింది. డైరెక్టర్ రోహిత్ శెట్టి స్వయంగా పోలీసులు ఉపయోగించే ఆయుధాలను చెక్ చేస్తూ ఈ టీజర్ లో కనిపించాడు. చివరిలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పోలీస్ గెటప్ లో దర్శనమిచ్చాడు. ‘జైహింద్’ అనే నినాదాల మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ వెబ్ సీరిస్ ఇది అనే విషయాన్ని రోహిత్ శెట్టి తెలిపాడు. గతంలో ముంబై పోలీసులను హైలైట్ చేసిన రోహిత్ ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఫోర్స్ పై దృష్టి పెట్టాడు. పోలీస్ అధికారి కబీర్ మాలిక్ గా ఇందులో సిద్ధార్థ్ కనిపించబోతున్నాడు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియపర్చలేదు. మొత్తం మీద వెండితెరపై పోలీస్ డ్రామాలను రక్తికట్టించిన రోహిత్ శెట్టి… ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.