ఓ స్టార్ హీరో మరో స్టార్ సినిమాకు గాత్రం అరువివ్వడం అభిమానులకు ఆనందం పంచే అంశమే! తెలుగునాట వాయిస్ ఓవర్ అనగానే ముందుగా మహేశ్ బాబు గుర్తుకు వస్తారు. ఆయన వ్యాఖ్యానంతో వెలుగు చూసిన సినిమాలు బాగానే సందడి చేశాయి. ఇప్పుడు మరోమారు మహేశ్ వాయిస్ ఓవర్ వినిపించబోతోంది. అదీగాక, ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ కావడంతో ఫ్యాన్స్ కు మరింత సంబరంగా ఉంది. ‘ఆచార్య’ చిత్ర దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రాలు పట్టుమని ఐదంటే ఐదే! అందులో నాలుగు చిత్రాలు వెలుగు చూశాయి. ఐదో సినిమాగా ‘ఆచార్య’ రాబోతోంది. ఆ నాలుగు సినిమాల్లో రెండు మహేశ్ తోనే కొరటాల శివ సాగడం విశేషం! ఆ అనుబంధంతోనే మహేశ్ ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఈ వార్త అటు ఘట్టమనేని అభిమానులకు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఆనందం పంచుతోంది.
ఓ స్టార్ సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం అన్నది కొత్తేమీ కాదు. ఈ సంప్రదాయం 1950లలోనే వెలుగు చూసింది. బి.యన్.రెడ్డి అపూర్వ కళాఖండం ‘మల్లీశ్వరి’కి నాటి మేటి నటులు చిత్తూరు వి. నాగయ్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి తెరకెక్కించిన ‘బంగారు పంజరం’ సినిమా నటరత్న యన్టీఆర్ వాయిస్ తోనే ఆరంభమవుతుంది. ఆ తరువాత స్టార్ హీరోస్ ఎవరికి వారు తమ చిత్రాలలో కథను ముందుకు సాగించడంలో వాయిస్ వినిపించారు. కానీ, ఓ స్టార్ హీరో మూవీకి మరో స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పించడం అన్నది ఈ మధ్యకాలంలో ‘జల్సా’తోనే మొదలయిందని చెప్పవచ్చు. ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హీరో మహేశ్ కు ఉన్న అనుబంధంతో ‘జల్సా’కు వాయిస్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత శ్రీను వైట్ల, జూ.యన్టీఆర్ తో తెరకెక్కించిన ‘బాద్ షా’కు కూడా మహేశ్ వ్యాఖ్యానం చేశారు. ఆ సినిమా సైతం అలరించింది. తన తండ్రి కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రానికి, తన అక్క మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాకు కూడా మహేశ్ గాత్రదానం చేశారు.
మహేశ్ బాటలోనే తరువాత మరికొందరు హీరోలు సాగారు. రవితేజ వ్యాఖ్యానంతో రాజమౌళి ‘మర్యాదరామన్న’, మంచు విష్ణు ‘దూసుకెళ్తా’, నాని నిర్మించిన ‘ఆ!’ చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో ‘మర్యాదరామన్న’ మంచి విజయం సాధించింది. జూ.యన్టీఆర్ వ్యాఖ్యానంతో ‘రామరామ కృష్ణ కృష్ణ’, ‘ఇజమ్’ చిత్రాలు వచ్చాయి. నారా రోహిత్ ‘స్వామి రారా’ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తనను హీరోగా పరిచయంచేసిన వైవిఎస్ చౌదరి చిత్రం ‘రేయ్’కు రామ్ వాయిస్ అందించారు. ‘డి ఫర్ దోపిడి’ చిత్రానికి నాని, ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్, ‘శ్రీనివాస కళ్యాణం’కు వెంకటేశ్, ‘హలో’ చిత్రానికి నాగార్జున వ్యాఖ్యానం చేశారు.
సునీల్ ‘నువ్విలా, జబర్దస్త్, కిక్-2’ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, పప్పు, భీమ్లి కబడ్డీ జట్టు’చిత్రాలకు అల్లరి నరేశ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి, అమ్మాయితో అబ్బాయి’ సినిమాలకు రాజ్ తరుణ్ వాయిస్ వినిపించారు.చిరంజీవి తొలి చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. కాగా తాను ‘బాహుబలి’గా తీర్చిదిద్దిన ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’కు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించడం మరింత విశేషం!
తమ నటనతోనే కాదు గాత్రంతోనూ మ్యాజిక్ చేస్తూ మన హీరోలు జనానికి మరింత చేరువ కావలనే చూస్తున్నారు. వీరి స్ఫూర్తితో భవిష్యత్ లో మరికొందరు స్టార్స్ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ వినిపించి మురిపిస్తారని ఆశించవచ్చు.