నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించి, కితకితలు పెట్టింది పాయల్ రాజ్ పుత్. ఆమె పేరు చెబితే అందరూ చప్పున గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ అనగానే ఇట్టే ఆమె అందాలను మరింతగా గుర్తు తెచ్చుకుంటారు యువకులు. నటిగా అంతకు ముందు కొన్ని చిత్రాలలో నటించినా, ‘ఆర్ ఎక్స్ 100’ తోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రాలలో ఓ వెలుగు చూసింది పాయల్.
పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో 1992 డిసెంబర్ 5న జన్మించింది. పదేళ్ళ ప్రాయం నుంచీ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే చలాకీతనంతో సాగింది. చదువుకొనే రోజుల్లోనే ఫ్యాషన్ షోస్ లో పాల్గొనేది. అదే ఆమెకు చిత్రసీమపై ఆసక్తి కలిగించింది. 2017లో రూపొందిన ‘చన్నా మెరేయ’ పంజాబీ చిత్రంతో తొలిసారి తెరపై తళుక్కుమంది పాయల్. తరువాత ‘వీరే కీ వెడ్డింగ్’ హిందీ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు ఏ మాత్రం గుర్తింపు నివ్వలేదు. కానీ, ఆమెలోని ఆకర్షణీయమైన రూపం తెలుగు దర్శకుడు అజయ్ భూపతికి నచ్చేసింది. తన ‘ఆర్ ఎక్స్ 100’ కథలో ఇందు పాత్రకు పాయల్ అయితే న్యాయం చేయగలదని భావించారాయన. అలా పట్టేసి, ఇలా సినిమాలో పెట్టేసి, జనానికి గిలి పుట్టించేశారు.
‘ఆర్ ఎక్స్ 100’ చూసిన ప్రతి కుర్రాడు పాయల్ అందాలను మరచిపోలేకపోయాడు. తరువాత యన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘కథానాయకుడు’లో గెస్ట్ గా కనిపించింది. “సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి” చిత్రాలలో నటించేసి అలరించింది పాయల్. ప్రస్తుతం ‘కిరాతక’ అనే తెలుగు చిత్రంతో పాటు ‘ఏంజెల్’ అనే తమిళ సినిమాలోనూ, ‘హెడ్ బుష్’ అనే కన్నడ మూవీలోనూ పాయల్ నటిస్తోంది. మరి ఈ సినిమాలలో పాయల్ అందం ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.