‘కెరీర్ ఆరంభంలో నితిన్‌కి డ్యాన్స్ రాకపోతే నేర్పించాను. కానీ తను నన్ను అవమానించాడు’ అని డాన్స్ మాస్టర్, డైరక్టర్ అమ్మ రాజశేఖర్ అంటున్నారు. కొరియోగ్రాఫర్ అయిన అమ్మ రాజశేఖర్ దర్శకుడుగా మారి కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తను దర్శకత్వం వహించిన ‘హాయ్ ఫైవ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ వేడుకలోనే హీరో నితిన్ పై వాడి వేడి వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం తన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వస్తానని రాకపోవడమే అని స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ”నితిన్‌కి డ్యాన్స్ తెలియని సమయంలో నేను నేర్పించాను. ఆ గౌరవంతో ‘గురువు’గా గౌరవించి వస్తాడని అనుకున్నా. నిజానికి పది రోజుల ముందే తనకి ఇన్ ఫామ్ చేశాను. వస్తాను అని అన్నాడు. వస్తాడనే అనుకున్నా. కానీ షూటింగ్ లేకపోయినా ఇంట్లో ఉండి కూడా రాలేదు. కనీసం బైట్ కూడా ఇవ్వలేదు. గురువును మరచి గౌరవం ఇవ్వకపోతే సూపర్ స్టార్ కాలేరు’’ అని అన్నారు. అయితే ‘హాయ్ ఫైవ్’ ట్రైలర్ పూర్తి స్థాయిలో అడల్డ్ కంటెంట్ తో నిండి ఉంది. నితిన్ అందుకే రాకపోయి ఉండవచ్చని, ఈ విషయంలో తనని తప్పుపట్టటానికి లేదంటున్నారు ఆయన సన్నిహితులు.