(ఫిబ్రవరి 26న శివాజీరాజా పుట్టినరోజు)
విలక్షణమైన నటనకు సలక్షణమైన రూపం శివాజీ రాజా అని చెప్పవచ్చు. చిత్రసీమను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము కాదని సామెత! అలా సినిమా రంగాన్ని నమ్ముకొని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించిన వారిలో శివాజీ రాజా పేరు కూడా చోటు చేసుకుంది. వందలాది చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారాయన. నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారాయన.
శివాజీ రాజా 1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి జి.రామరాజు, తల్లి చంద్రావతి. చదువుకొనే రోజుల్లోనే శివాజీరాజా సినిమా హీరోలను అనుకరిస్తూ నటించి, చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకొనేవారు. అతనిలోని చలాకీ తనం గమనించిన మిత్రులు ప్రోత్సహించారు. చెన్నపట్టణం చేరి సినిమా అవకాశాల కోసం పలు పాట్లు పడ్డారు శివాజీరాజా. బాలకృష్ణ ‘సీతారామకళ్యాణం’ వంటి చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ రఘు మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ‘కళ్ళు’ చిత్రం శివాజీరాజాకు మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ తరువాత నుంచి పలు చిత్రాలలో కీలక పాత్రల్లో అలరిస్తూ వచ్చారు రాజా.
శివాజీరాజా హీరోగా ‘అహో బ్రహ్మ – ఓహో శిష్యా’ ‘మొగుడ్స్ అండ్ పెళ్ళామ్స్’వంటి సినిమాలు రూపొందాయి. బుల్లితెరపై కూడా శివాజీరాజా అలరించారు. ఆయన నటించిన “అమృతం” సీరియల్ విశేషాదరణ చూరగొంది. “మొగుడ్స్ – పెళ్ళామ్స్” టీవీ షోలోనూ ఆకట్టుకున్నారు. “శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, సంబరాల రాంబాబు, నాలో సగం, మిస్టర్ రోమియో” వంటి సీరియల్స్ లోనూ శివాజీరాజా తనదైన బాణీ పలికించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ శివాజీరాజా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు విజయ్ కూడా నటునిగా రాణిస్తున్నాడు. ‘వేయి శుభములు కలుగు నీకు’ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ ఫిబ్రవరి 26తో శివాజీరాజా షష్టి పూర్తి చేసుకుంటున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.