వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉందని అంటూ ఉంటారు రసికులు. నాజూకు సోకుల నల్లకలువ హ్యాలీ బెర్రీ సైతం అదే పాట అందుకుంది. ప్రముఖ పాటగాడు వ్యాన్ హంట్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తూ ఉందని జనానికి తెలుసు. కానీ, ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని, వాటిని విడదీసుకున్న హ్యాలీ తన 55 ఏళ్ళ వయసులో వ్యాన్ హంట్ పై మనసు పారేసుకోవడం విశేషమనే చెప్పాలి. జనవరి 1వ తేదీన వీరిద్దరూ జరుపుకున్న ఓ పార్టీకి సంబంధించిన పిక్స్, వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హ్యాలీ. అమ్మడికి మళ్ళీ పెళ్ళి అనుకున్నారు జనం. కొన్నాళ్ళకే, అది కేవలం పార్టీయే ఏ లాంటి పెళ్ళి లేదు అంటూ పేర్కొంది. కానీ, ఇప్పుడు ఆ ఫేక్ వెడ్డింగ్ న్యూస్ కాస్తా రియల్ కాబోతోందని హాలీవుడ్ కోడై కూస్తోంది.
హ్యాలీ బెర్రీ ఎనిమిదేళ్ళ తనయుడు మేసియో తనకు తానుగా ఈ వేడుక ఏర్పాటు చేశాడట! దీంతో అతని మనసులో తనపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తమయిందని హ్యాలీ మురిసిపోతోంది. మేసియో తన మనసులోని మాట గ్రహించే ఇలా చేశాడనీ ఈ తల్లి మనసు పొంగిపోతోంది. తనను, వ్యాన్ హంట్ ను ప్యాండమిక్ ఒకటి చేసిందని చెబుతోంది హ్యాలీ. ఐసోలేషన్ లో ఉన్న నాలుగు నెలల్లో ఇద్దరూ ప్రతి రోజూ గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకొనేవారట. ఆ సమయంలోనే ఒకరిమనసులో ఒకరు చోటు సంపాదించామన్న వాస్తవం కూడా తెలిసిపోయిందని చెబుతోంది హ్యాలీ. ఆ విషయాన్ని తన తనయుడు మేసియో కూడా గ్రహించాడంటే, అంతకంటే ఆనందం ఏముంటుందనీ సంబరపడుతోంది.
ఏది ఏమైనా, 55 ఏళ్ళ ఈ నల్ల కలువ, 51 సంవత్సరాల వ్యాన్ హంట్ చేయి అందుకోవడానికి ఈ వేడుక ఊతమిచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు పెళ్ళాడిన అనుభవమున్న హ్యాలీకి జీవితంలో ఎన్నడూ ఎరుగని ఆనందం వ్యాన్ ద్వారానే లభించిందని అంటోంది. తన జీవితంలో అసలైన వ్యక్తి వ్యాన్ అన్న సత్యం బోధపడిందనీ చెబుతోంది. ఆమె మాటల హోరు చూస్తోంటే, త్వరలోనే వ్యాన్ హంట్ దానిని పాటగా మార్చేలా ఉన్నాడనిపిస్తోంది. ఏది ఏమైనా హ్యాలీ, వ్యాన్ త్వరలోనే ఒకటి కావడమన్నది ఇద్దరు అభిమానులకు ఆనందం పంచుతోంది.