సంగీతం వింటే శిశువులు, పశువులు, పాములు సైతం పరవశించి పోతాయని ప్రతీతి! అంటే సంగీతానికి భాషాభేదాలు లేవు, కావలసిందల్లా వీనులకు విందు చేసే శక్తి! అలాంటి శక్తితోనే ఎంతోమంది పరభాషా సంగీత దర్శకులు తెలుగునాట జైత్రయాత్ర సాగించారు. నవతరం సంగీత దర్శకుల్లో జిబ్రాన్ తనదైన బాణీలు పలికిస్తూ తెలుగువారినీ ఆనందంలో మునకలు వేయిస్తున్నారు.
జిబ్రాన్ 1980 ఆగస్టు 12న తమిళనాడులోని కొయంబత్తూరులో జన్మించారు. అక్కడే పదో తరగతిదాకా చదువు సాగింది. జిబ్రాన్ పదేళ్ళ ప్రాయంలో ఉండగా, విఖ్యాత గ్రీస్ సంగీత కళాకారుడు యెన్ ప్రదర్శనను టీవీలో చూశాడు. అప్పటి నుంచీ సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు జిబ్రాన్. వాళ్ళ నాన్న వ్యాపారంలో బాగా దెబ్బతినడంతో వారి కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది. అక్కడ కుటుంబ పోషణ కోసం జిబ్రాన్ పలు పనులు చేశారు. అయితే సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అక్కడి ట్రినిటీ కాలేజ్ లండన్ లో గ్రేడ్ 8 కోర్స్ పూర్తి చేశారు జిబ్రాన్. కొంతకాలం సింగపూర్ లో ఆస్ట్రేలియన్ కంపోజర్ లిండ్సే వికరీ దగ్గర అసోసియేట్ గా చేసి ‘ఫిలిమ్ స్కోరింగ్’లో తర్ఫీదు పొందారు జిబ్రాన్. తరువాత సింగపూర్ లోనే సొంతగా దాదాపు 700 యాడ్స్ కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్వదేశం వచ్చాక అంత ప్రోత్సాహకంగా వాతావరణం కనిపించలేదు. ఆ సమయంలో దర్శకుడు ఎ.సర్కునమ్ తాను తెరకెక్కించిన ‘వాగై సూడా వా’ అనే చిత్రానికి జిబ్రాన్ తో స్వరకల్పన చేయించారు. ఆ సినిమాతోనే జిబ్రాన్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత మరి వెనుతిరిగి చూసుకోలేదు.
యువదర్శకుడు సుజిత్ తొలి చిత్రం ‘రన్ రాజా రన్’కు జిబ్రాన్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమాతోనే తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టారు జిబ్రాన్. ఆ పై “జిల్, బాబు బంగారం, హైపర్, ఉంగరాల రాంబాబు, రాక్షసుడు, సాహో, అశ్వథ్థామ, హీరో, సబాస్టియన్ పి.సి.
524” చిత్రాలకు బాణీలు కట్టారు జిబ్రాన్. కమల్ హాసన్ సైతం ఆయన బాణీలు మెచ్చి తన ‘చీకటి రాజ్యం’, ‘విశ్వరూపం’ చిత్రాలకు జిబ్రాన్ తో స్వరకల్పన చేయించారు. ఇప్పటికీ తనదైన స్వరకల్పనతో ఆకట్టుకుంటున్నారు జిబ్రాన్. మరో విశేషమేమంటే, జిబ్రాన్ భార్య అచ్చ తెలుగు అమ్మాయి. విజయవాడకు చెందిన ఆమెతో సింగపూర్ లో పరిచయం ఏర్పడింది. అలా తెలుగువారి అల్లుడయ్యారు జిబ్రాన్. ఇప్పటికీ దరికి చేరిన చిత్రాలకు తన బాణీలతో న్యాయం చేయడానికి తపిస్తూనే ఉంటారు జిబ్రాన్. సింగపూర్, ముంబై, చెన్నయ్ లలో కంపోజ్ చేయడానికి అటూఇటూ తిరుగుతూనే తన సంగీతంతో ఆకట్టుకుంటున్న జిబ్రాన్ మరింత మధురం పంచాలని ఆశిద్దాం.