ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ కల నిజమైంది. ‘మై విలేజ్ షో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వకు సొంత ఇల్లు కావాలన్నది చిరకాల కోరిక. ‘బిగ్ బాస్-4’లో కన్పించిన గంగవ్వ నాగార్జున ముందు తన కోరికను వ్యక్తం చేసింది. ఆ షో చేస్తున్న సమయంలో నాగార్జున గంగవ్వ కోరిక విని, ఆమె ఇల్లు కట్టుకోవడానికి కావలసిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నాగార్జున గంగవ్వకు ఆర్థిక సాయం అందించగా గంగవ్వ కల నెరవేరింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి గంగవ్వ బయటకు రాగానే నిర్మాణం ప్రారంభమైంది. మంగళవారం ఆమె గృహ ప్రవేశ వేడుక జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాలను పంచుకుంటూ గంగవ్వ తనకు సహాయం చేసిన నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది.
Read also : “పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
గంగవ్వ తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందినది. గంగవ్వ బిగ్ బాస్ షో నుండి రూ. 11 లక్షలు సంపాదించగా, నాగార్జున రూ. 7 లక్షల విరాళాన్ని అందించారు. 3 లక్షల అప్పులు చేసి తన కల సాకారమయ్యేలా చూసుకుంది ఆమె. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గత ఏడాది బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్, సావిత్రి (శివ జ్యోతి) తదితరులు గంగవ్వ గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు.