Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది ఈ సినిమా కోసం చిత్రబృందం 9 ఏళ్లు వెచ్చించి క్రౌడ్ ఫండింగ్ తో పూర్తిచేసిన విషయం తెల్సిందే. రూ. 25 లక్షలు పోగుచేసి ఈ సినిమాను తెరకెక్కించారు. గామి మొదలుపెట్టినప్పుడు విశ్వక్ హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు. మధ్యలో స్టార్ డమ్ వచ్చినా కూడా అతను పూర్తి చేయకుండా.. అనుకున్నదాని ప్రకారమే ఫండ్ చేసి సినిమాను పూర్తి చేశారు.
ఇక సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో గామి టీమ్ ఒక కీలక నిర్ణయాన్నితీసుకుంది. కలక్షన్స్ మంచిగా రావడంతో.. ఈ సినిమా కోసం డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వారి డబ్బును రిటర్న్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు మేకర్స్.. ” మేం ఈ మైలురాయిని చేరుకున్నందున మీరు సినిమాపై పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలనుకుంటున్నాం” అని ఇన్వెస్టర్లకు మెయిల్ పంపారు. కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా లాభాలను.. అంటే వారు పెట్టిన రూపాయికి ఇంకో రూపాయి వేసి మరీ ఇవ్వనున్నారట. నిజం చెప్పాలంటే.. ఇది మంచి విషయం. ఇలా చేస్తే.. క్రౌడ్ ఫండింగ్ ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారు. కథలు ఉన్నా డబ్బులు లేనివారికి ఈ నిర్ణయం ఎంతో ఉత్తేజపరుస్తుంది. సినిమా హిట్ అయితే.. తిరిగి వారి డబ్బు వారికి వస్తుంది అనే ధైర్యాన్ని ఇస్తుంది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది.