Gaami Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా విచ్చేసి రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
” నేను ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చానో.. నాకీ సమస్య ఎప్పటినుంచో ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదు” అంటున్న విశ్వక్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. మొదటి నుంచి ఈ సినిమాలో విశ్వక్ కు ఒక సమస్య ఉంది.. వేరే మనిషి అతడిని పట్టుకున్నా.. కనీసం ముట్టుకోవాలని దగ్గరకు వచ్చినా అతనికి శరీరం అంతా పగిలిపోతూ ఉంటుంది. అంటే మానవ స్పర్శ అతడికి తగలకూడదు. దీని మీదనే గామి కథ ఉంటుందని అనుకున్నారు. కానీ, ట్రైలర్ లో అంతకు మించిన కథను చూపించాడు డైరెక్టర్. అఘోర అయిన శంకర్ తనకున్న సమస్యను పోగొట్టుకోవాలంటే.. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసరి వికసించే పుష్పాన్ని తాకాలి. అక్కడకు శంకర్ చేసే ప్రయాణమే గామి. కానీ, ఇందులో మరో రెండు సమస్యలను చూపించాడు. దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం.. ఆమె ఊరి నుంచి పారిపోవడం.. ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పుకొచ్చారు. ఇంకోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా చూపించారు. అక్కడనుంచి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించడం చూపించారు. అసలు ఈ రెండు ఘటనలకు.. శంకర్ కు ఏంటి సంబంధం.. ? అసలు శంకర్ కు ఆ సమస్య ఎలా వచ్చింది.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. విశ్వక్ మరో కొత్త కథతో రాబోతున్నట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. ఇక మొదటి షాట్ లో.. సింహంతో హిమాలయాల మధ్య ఫైట్ హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా మర్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.