Comedy Stock Exchange: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ మూవీస్ మరో ఎత్తు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ను మిక్స్ చేసి అనిల్ తీసిన ఈ రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఆహాలో అనిల్ నేతృత్వంలో సాగుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ రెండో ఎపిసోడ్ కు అదే థీమ్ ను ఎంచుకున్నారు. రిలేషన్స్ షిప్స్ నేపథ్యంలో ఫస్ట్ రౌండ్ లో కామెడీ పండించమని స్టాక్స్ ను యాంకర్స్ సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి కోరారు.
‘అట్లుంటది మనతోని’ అనే తొలి రౌండ్ లో హరి ఫంక్షన్స్ లో కలిసే బంధువుల ప్రవర్తన గురించి ఫన్ పండించాడు. పనిలో పనిగా సుడిగాలి సుధీర్, రష్మీ రిలేషన్ షిప్ మీదా జోక్ వేశాడు. ఆ తర్వాత వరుసగా ముక్కు అవినాశ్ ఫస్ట్ నైట్ వైఫ్ అండ్ హజ్బెండ్ రిలేషన్ గురించి చెబితే; రాజు అత్త-అల్లుళ్ల రిలేషన్స్ పై కామెడీ చేశాడు. హీరోలకు ఉండే రేర్ ఫ్యాన్స్ గురించి చెప్పి వేణు కడుపుబ్బ నవ్వించాడు. బావ – బావమరిది మందు పార్టీ చేసుకునేటప్పుడు వాళ్ళ మధ్యన రిలేషన్స్ ఎలా ఉంటాయో భాస్కర్ – జ్ఞానేశ్వర్ చూపించారు. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు భాస్కర్ – జ్ఞానేశ్వర్ జోడీకే లభించాయి.
రెండో రౌండ్ ‘పదా చూసుకుందాం…’లో రిలేషన్స్ కు సంబంధించిన టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారి గ్రాఫ్ పెరిగేలా సెట్ చేశారు. ఇందులో రాజు ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి, ఈ రౌండ్ ముగిసే సమయానికి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక ఫైనల్ రౌండ్ ‘ఇచ్చి పడేద్దాం’ వినోదాల విందును వడ్డించింది. ఆ ఇంటిలోని వ్యక్తులందరికీ మెంటల్! వారికి ట్రీట్ మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ పరిస్థితి ఏమైందన్నదే ఈ రౌండ్! ఇందులో డాక్టర్ క్యారెక్టర్ ను సుడిగాలి సుధీర్ పోషించడం విశేషం. ఇది పూర్తయ్యే సరికీ వీక్షకులు వేణును అగ్ర స్థానంలో నిలిపారు. మొత్తం మీద అనిల్ రావిపూడి తనదైన పంథాలో ఈ షోను ఆద్యంతం ఆసక్తికరంగా నడుపుతున్నారు.