నాలుగేళ్ళ ప్రాయం నుంచీ కెమెరా ముందు అదరక బెదరక నటించిన శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ఏది అంటే? తెలుగులోనా, తమిళంలోనా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ దాదాపు ఒకే సమయంలో నాయికగా కనిపించారు శ్రీదేవి. తొలుత ‘అనురాగాలు’లో జ్యోతి అనే అంధురాలి పాత్రలో నాయికగా నటించింది. ఆ సినిమా శ్రీదేవికి మంచి పేరు తెచ్చింది. అదే సమయంలో తమిళంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రధారులుగా కె.బాలచందర్ ‘మూండ్రు ముడిచు’ తెరకెక్కించారు. తమిళంలో శ్రీదేవి నాయికగా తొలి చిత్రం అదే!ఈ రెండు సినిమాల్లో నటిగా మంచి మార్కులు పోగేసుకున్న శ్రీదేవితో దాసరి నారాయణరావు తెరకెక్కించిన సినిమా ‘మా బంగారక్క’. మురళీమోహన్ హీరోగా ఈ సినిమా రూపొందింది. 1977 మే 20న ప్రేక్షకుల ముందు నిలచిన ఈ సినిమాతో శ్రీదేవికి హీరోయిన్ గానూ మంచి గుర్తింపు లభించింది. అందువల్ల చాలామంది శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ‘మా బంగారక్క’ అనుకుంటూ ఉంటారు.
ఓ మధ్య తరగతి కుటుంబం, ఉన్నత కుటుంబం మధ్య సాగే కథతో ‘మా బంగారక్క’ తెరకెక్కింది. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిన
ఈ చిత్రాన్ని రవిశంకర్ పిక్చర్స్ పతాకంపై వై.సునీల్ చౌదరి నిర్మించారు. శ్రీదేవి, మురళీమోహన్, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమాప్రభ, నిర్మల, నగేశ్, కేవీ చలం తదితరులు నటించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి దేవులపల్లి, సి.నారాయణ రెడ్డి పాటలు రచించారు. “దూరాన దూరాన తారాదీపం…”, “చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ…”, “ఆకుపచ్చని కొమ్మల నడుమ…”, “నా హృదయం నాగార్జున సాగరం…”, “మధువనిలో ఆడవే రాధికా..” వంటి పాటలు అలరించాయి. ఇక ‘కంచుకోట’లోని “సరిలేరు నీకెవ్వరు…” పాట బాణీలతోనే “సరియేది మన ప్రేమకు…” అనే పాట రూపొందింది. ఆ పాట భలేగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం తొలుత ‘బంగారక్క’గానే ఆరంభమయింది. మరి ఎందువల్లో ‘మా’ అన్న అక్షరం కూడా ముందు చేరింది. దాసరి దర్శకత్వంలో శ్రీదేవి నటించిన తొలి చిత్రం ‘మా బంగారక్క’. మురళీమోహన్ సరసన శ్రీదేవి నాయికగా నటించిన మొదటి సినిమా కూడా ఇదే. అయితే శ్రీదేవి సరసన మొట్టమొదటిసారి జోడీ కట్టిన నటుడు ఎవరు? అన్న ప్రశ్నకు కూడా భిన్న సమాధానాలు వినిపిస్తాయి. ‘అనురాగాలు’లో శ్రీదేవి సరసన హీరోగా నటించింది రవికాంత్. తరువాత ‘పదహారేళ్ళ వయసు’లో శ్రీదేవితో మరోమారు నటించాడు. అందులో డాక్టర్ గా కనిపిస్తాడు. ‘మూండ్రు ముడిచు’లో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కథానాయకులే. మరి శ్రీదేవితో తొలుత జోడీ కట్టి చిందేసి కనువిందు చేసింది ఎవరో తెలుసా? ప్రఖ్యాత హాస్యనటుడు రాజబాబు. అవును, కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘దేవుడులాంటి మనిషి’లో ఆయనకు మేనకోడలుగా నటించింది శ్రీదేవి. ఇందులో రాజబాబు, ఆమెకు జోడీగా నటించారు. వీరిద్దరిపై “ద్రాక్ష పండు తియ్యన… నిమ్మపండు పుల్లన…” అనే పాట కూడా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక, కృష్ణ, విజయనిర్మల దంపతులు శ్రీదేవి తల్లి రాజేశ్వరిని మందలించారు. శ్రీదేవితో చిన్నాచితకా పాత్రలు కాకుండా, మంచి అవకాశాలు వచ్చినప్పుడే నటింప చేయమని సలహా ఇచ్చారు. ఆ తరువాత ‘అనురాగాలు’లో నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్రలో శ్రీదేవి తొలిసారి నాయికగా నటించింది. తరువాత బాలచందర్ దర్శకత్వంలోనూ నటిగా భళా అనిపించింది. ఇలా ‘మా బంగారక్క’లా జనం మదిలో నిలచిన శ్రీదేవి నాయిక పాత్రకు కూడా ఓ ప్రత్యేక కథ ఉంది.