ఆగస్ట్ 1వ తేదీ నుండి తెలుగు సినిమాల షూటింగ్స్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం నుండి ‘షూటింగ్స్ అతి త్వరలోనే మొదలు కాబోతున్నా’యనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ”ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ ఆపేసి కమిటీలు వేసుకున్నాం. సినిమా షూటింగ్ లో ఎందుకు వృధా ఖర్చు అవుతోందనే విషయంలో చర్చించాం. నిర్మాతలుగా మేం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. థియేటర్లు, మల్టీప్లెక్స్ వారితో మాట్లాడాం. టిక్కెట్ ధరల గురించి, అక్కడ అమ్మే ఫుడ్ రేట్ గురించి కూడా చర్చ జరిగింది. వారంతా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఎగ్జిబిటర్స్ తో ఎగ్రిమెంట్స్ చేసుకోబోతున్నాం. అలానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తోనూ చర్చలు జరిపాం. ఛాంబర్ కు, ‘మా’కు ఈ రోజు ఓ అగ్రిమెంట్ జరిగింది. అది గ్రేట్ అఛీవ్ మెంట్. ఇక ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తో వేతనాలకు సంబంధించి చర్చలు సఫలమయ్యాయి. వర్కింగ్ కండీషన్స్ గురించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది. అయితే ఉదయం నుండి రేపే షూటింగ్స్ మొదలు కాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. మరోసారి అందరం కూర్చుని ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ బాలీవుడ్ కూడా మన వైపు ఆసక్తికరంగా చూస్తోంది. మనం షూటింగ్స్ ఆపి, ఏం చేయబోతున్నామని వాళ్ళు ఆరా తీస్తున్నారు. సో… కన్ స్ట్రక్టివ్ గా ముందుకు పోవాల్సి ఉంది. మనం తీసుకునే నిర్ణయాలను ఇతర భాషలకు చెందిన సినిమా వాళ్ళూ ఆచరించడానికి రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు వివరిస్తాం. అప్పుడే షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభించేది తెలియచేస్తాం. అలానే ఓటీటీలో ఎనిమిది వారాల తర్వాతే సినిమా ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం” అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఛాంబర్ కు సంబంధించిన కార్యవర్గ సభ్యులూ పాల్గొన్నారు.