Movies Shooting: యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయం మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సైతం సినిమా షూటింగ్స్ రద్దుకు సంపూర్ణ మద్దత్తు పలికాయి. అయితే చిన్న చిత్రాల నిర్మాతలు కొందరు మాత్రం షూటింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు. బట్… మెజారిటీ సినిమాల షూటింగ్స్, భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణలు ఆగస్ట్ 1 నుండి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ‘దిల్’ రాజు అతి త్వరలోనే తమ సమస్యలకు పరిష్కారం దొరకబోతోందని, నాలుగైదు రోజుల్లో షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది చెబుతామని అన్నారు.
Read Also: Pineapple For Health: పొట్ట తగ్గడానికి సులువైన మార్గం
తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్స్ ను కొన్ని నిబంధనలకు లోబడి తిరిగి ప్రారంభించ బోతున్నారు. అయితే వాటిలో తొలి ప్రాధాన్యం షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలకు ఇవ్వబోతున్నారు. ‘రెండు మూడు రోజుల షూటింగ్ తో తమ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసే వారమని, కాని హఠాత్తుగా షూటింగ్స్ ఆపేయడంతో ఇబ్బంది పడుతున్నామ’ని కొందరు నిర్మాతలు ఆ మధ్య వాపోయారు. వారికి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అలానే రేర్ కాంబినేషన్స్ ను సెట్ చేసుకున్న వారికి, తర్వాత తిరిగి ఆర్టిస్టుల డేట్స్ దొరకవు అనుకునే వారికి కూడా షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి లభించబోతోందట. మొత్తం మీద తెలుగు ఫిల్మ్ ఛాంబర్, యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పలు దఫాలుగా జరిపిన చర్చలతో సమస్యలకు కొంతమేర పరిష్కారం లభించినట్టు అయ్యింది. మరో వారంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి, అగ్రిమెంట్స్ చేసుకుని అన్ని సినిమాల షూటింగ్స్ ను మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. అంతవరకూ కొంతమేరకు సడలింపు ఇచ్చినట్టే.