సినిమా స్టార్లకు అభిమానులు ఉండడం సహజమే.. కానీ ఆ అభిమానం మీతిమీరితేనే సమస్య. తమ అభిమానం హీరో సినిమా బాగోకపోయినా, టిక్కెట్ దొరకకపోయినా పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక బాలుడు.. ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాలలోని పురానీ పేటకు చెందిన 11 ఏళ్ల బాలుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. అతడికి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఇక ఫిబ్రవరి 25 న ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకున్నాడు. ఆన్ లైన్ లో టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారని స్నేహితుడు చెప్పడంతో సినిమా టికెట్ కోసం రూ. 300 కావాలని తండ్రిని అడిగాడు. అయితే దినసరి కూలీగా పనిచేస్తున్న తండి కొడుకు కోరికను కాదన్నాడు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయని, బద్దలుకొట్టి చూడగా బాలుడు ఉరికి వేళ్ళాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తునట్లు సమాచారం. అయితే ఇదంతా సినిమాకోసమేనా..? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.