Fahadh Faasil Gives Hint On Pushpa Part 3: సీక్వెల్ సినిమాలు దాదాపు రెండో భాగంతోనే పూర్తవుతాయి. మూడోది అంటే గగనమే! తెలుగులో ఇంతవరకూ అలాంటి ప్రయత్నమైతే జరగలేదు. ఏవో ఒకట్రెండు చిన్న సినిమాల (మనీ) నుంచి మూడు భాగాలు వచ్చి ఉండొచ్చేమో గానీ, క్రేజీ ప్రాజెక్టులైతే రెండో భాగానికి ఆగిపోయాయి. అయితే.. తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం పుష్పకి మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇదేదో గాల్లో కొట్టుకొచ్చిన రూమర్ కాదు.. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్ర(భన్వర్‌సింగ్ షెకావత్)లో నటిస్తోన్న ఫహాద్ ఫాజిల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. పుష్ప సినిమా రెండో పార్ట్‌తో ఆగేది కాదని, మూడో పార్ట్ కూడా ఉందని కుండబద్దలు కొట్టాడు.
ఫహాద్ మాట్లాడుతూ.. ‘‘పుష్ప కథను సుకుమార్ నాకు మొదట్లో చెప్పినప్పుడు.. ఒక పార్ట్‌లోనే ఈ సినిమాని కంప్లీట్ చేయాలని అనుకున్నారు. కానీ, పోలీస్ స్టేషన్ సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత ఈ సినిమా రెండు భాగాలుగా మారింది. అందులోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉండు అని సుకుమార్ నాతో చెప్పారు. మూడో భాగానికి కావాల్సిన మెటీరియల్ కూడా తన వద్ద ఉందని సుకుమార్ అన్నారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అసలు పుష్ప-2 కోసమే సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. పుష్ప-1 భారీ విజయం సాధించడంతో, రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు పుష్ప-3 అనే వార్త తెలియడంతో.. సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
ఈమధ్య సీక్వెల్స్, మల్టీవర్స్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలోనే సుకుమార్ ఇలా మూడో భాగానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తనకు తెలుగు డైలాగులు నేర్చుకునేందుకు బన్నీ సహా సుకుమార్ చాలా సపోర్ట్ చేస్తున్నారని, తనకు సమయం కూడా ఎక్కువగా ఇస్తున్నారని పేర్కొన్నాడు. పుష్ప షూటింగ్ సమయంలో తాను చాలా కంఫర్టబుల్‌గానే ఉండేవాడినని ఫహాద్ వెల్లడించాడు. మరోవైపు.. పుష్ప-2 సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం.