ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజును మించిన వారు లేరు. గత కొంతకాలంగా ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే చాలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, సినిమా టిక్కెట్ రేట్లును నిర్మాతలు పెంచుకుంటున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లాంటి భారీ బడ్జెట్ మూవీ విషయంలో ఇది సమంజసమే కానీ ఇతర చిత్రాల టిక్కెట్ రేట్లనూ పెంచి అమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన ఒకటి వచ్చింది. పాన్ ఇండియా సినిమాల విషయంలోనూ ఇది కరెక్ట్ కాదంటూ కొందరు సరికొత్త వాదనకు దిగారు. ‘సినిమాను ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు మార్కెట్ పెరుగుతుంది కదా, ఇతర రాష్ట్రాల నుండి కూడా నిర్మాతలకు డబ్బులొస్తాయి కదా… మరి అలాంటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మించి టిక్కెట్ రేట్ అమ్మడం ఎంతవరకూ సమంజసం?’ అని ప్రశ్నించారు.
చిరంజీవి ‘ఆచార్య’, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాలకు రేట్లు పెంచి అమ్మడం ఎంతమాత్రం సబబు కాదని కొందరు విమర్శించారు. ఇలా టిక్కెట్ రేట్లు పెంచి అమ్మడం వల్ల ఓపెనింగ్స్ బాగా పడిపోయాయని, సైడ్ థియేటర్లలో కొన్ని షోస్ రద్దు చేసిన సందర్బాలు ఉన్నాయని మరి కొందరు తెలిపారు. ఏతావాతా టిక్కెట్ రేట్లు పెంచడమన్నది పెద్ద సినిమాలకు సైతం నష్టాన్ని కలిగించింది తప్పితే లాభాన్ని కలిగించలేదనేది మెజారిటీ ఎగ్జిబిటర్స్ చెబుతున్న మాట. బహుశా ‘దిల్’ రాజు అభిప్రాయం కూడా అదే కావచ్చు… అందుకే తమ తాజా చిత్రం ‘ఎఫ్ 3’ టిక్కెట్ రేట్లు పెంచడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతోనే హ్యాపీగా ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఆయన అన్నారు. మరి ‘దిల్’ రాజు తీసుకున్న ఈ నిర్ణయంతో అయినా ఈ నెల 27న విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయేమో చూడాలి.