అరుణ్ విజయ్, ప్రియా భవానీ జంటగా నటిస్తున్న తమిళ సినిమా ‘యానై’. తెలుగులో దీనిని ‘ఏనుగు’ పేరుతో డబ్ చేశారు. ఈ రెండు భాషల్లో సినిమా ఇదే నెల 17న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ చిత్రబృందం సమక్షంలో హైదరాబాద్ లో తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘సింగం’ సీరిస్ ఫేమ్ హరి దీనికి దర్శకత్వం వహించారు. విశేషం ఏమంటే చిత్ర కథానాయకుడు అరుణ్ విజయ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు కాగా, చిత్ర దర్శకుడు హరి… విజయ్ కుమార్ – మంజులకు అల్లుడు. సో… డైరెక్టర్ అండ్ హీరో బావ బామ్మర్దులన్న మాట! ఈ సినిమాను తెలుగులో సిహెచ్ సతీశ్ కుమార్, వేదికకారన్ పత్తి, ఎస్ శక్తివేల్ రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు హరి మాట్లాడుతూ, ”నేను చేస్తున్న 16వ సినిమా ఇది. ఈ ‘ఏనుగు’ కమర్షియల్ , ఎమోషనల్, యాక్షన్ సినిమా. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా ఇది ఉంటుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలను ఇందులో వినోదాత్మకంగా చూపిస్తూ, చిన్నపాటి సందేశమూ ఇచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ మూవీలోని పాయింట్ తో కనెక్ట్ అవుతారు” అని చెప్పారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ, ”నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్ మూవీ. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. హరి సార్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ చూపించడం జరిగింది. జి. వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు” అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ”తెలుగు ప్రేక్షకులు ఈ తరహా ఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే మంచి కంటెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఏనుగు’ను తీర్చిదిద్దాం. ఏనుగుకు ఎంత బలం ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు” అని చెప్పారు.

నటుడు సముతిర కని మాట్లాడుతూ, ”దర్శకుడు హరిది నాదీ ఒకటే స్కూల్. అయినా హరి దగ్గర్నుంచి ప్రతి రోజు చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. ‘ఏనుగు’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవుతారు. హీరో, హీరోయిన్ చాలా చక్కగా నటించారు. వారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. హీరోయిన్ ప్రియా భవానీ మాట్లాడుతూ, ”ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. సీనియర్ ఆర్టిస్టులు ఎంతో మందితో కలిసి నటించే అవకాశం ఈ మూవీ ద్వారా లభించింది” అని అన్నారు. నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు.