రాధేశ్యామ్ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో.. ప్రభాస్ అభిమానులు అతని తదుపరి సినిమాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా.. సలార్ సినిమా కోసం చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ‘సలార్’ ఉండొచ్చని తొలుత అంతా భావించారు. గతేడాది మేకర్స్ వేగవంతంగా పనులు ప్రారంభించడం, గ్యాప్ లేకుండా షూట్స్ నిర్వహించడంతో.. ఈ ఏడాదిలోనే సలార్ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఆ ఆశలపై మేకర్స్ నీరు గార్చేశారు.
ఇప్పటివరకు కువలం 25 నుంచి 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయ్యిందని.. మిగిలిన చిత్రీకరణ ఈ ఏడాది నవంబర్ కల్లా ముగుస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన, ‘సలార్’ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుందని క్లారిటీ వచ్చేసింది. అటు.. ఆదిపురుష్ సైతం ఈ ఏడాది నుంచి 2023కి వాయిదా పడింది. దీంతో.. ఈ ఏడాదిలో మరో ప్రభాస్ సినిమా లేదని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్‌మెంట్‌కి గురయ్యారు. అయితే, ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఆ రెండు సినిమాలూ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. ఈ లెక్కన, ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ బొనాంజానే కదా! ఒకటేమో (సలార్) మాస్ జాతర, మరొకటేమో రాముడిగా ప్రభాస్ తన ఫ్యాన్స్‌కి ప్రత్యేక ట్రీట్ ఇవ్వనున్నాడన్నమాట!
మరో విషయం ఏమిటంటే.. ఆదిపురుష్ చిత్రీకరణ ఆల్రెడీ పూర్తయ్యింది. ఇందులో గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉండడంతో, ఈ పనుల కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. గ్రాఫిక్స్ పార్ట్ మొత్తం సహజంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ షూట్‌లోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది కూడా గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా కావడంతో, నాగ్ అశ్విన్ 2024లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించాడు.