చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు మరో ఛాన్స్ దక్కింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో తనదైన శైలిలో నటించి, మెప్పించింది నేహా శెట్టి. మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆమె శరీరం మీద పుట్టుమచ్చలపై కాస్తంత కాంట్రవర్శీ చెలరేగినా… అదీ సినిమా ప్రమోషన్ కు బాగానే ఉపయోగపడింది. మొత్తం మీద ఈ నెల 12న విడుదలైన ‘డీజే టిల్లు’ కుర్రకారును కిర్రెక్కిస్తోంది.
బాధాకరం ఏమంటే కరెక్ట్ గా ‘డీజే టిల్లు’ సినిమా విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు… నేహాశెట్టి బామ్మ చనిపోయింది. చిన్నప్పటి నుండీ తనను పెంచి పెద్ద చేసి, తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన ఆవిడ మరణం నేహాశెట్టిని సహజంగానే కృంగ తీసింది. మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే అన్ని ప్రమోషనల్ ఇంటర్యూస్ కాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది నేహా శెట్టి. అయితే ఒక్కసారి మూవీకి సక్సెస్ టాక్ రావడంతో దానిని అందిపుచ్చుకుని కెరీర్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది కాబట్టి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుసుకున్న నేహా దుఃఖాన్ని దిగమింగుకుని సక్సెస్ టూర్ కు వచ్చేసింది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ‘డీజే టిల్లు’ ప్రదర్శిస్తున్న థియేటర్స్ కు వెళ్ళి హీరో సిద్ధూ, హీరోయిన్ నేహా, దర్శకుడు విమల్ కృష్ణ ఆడియెన్స్ కు స్వయంగా ధ్యాంక్స్ చెబుతున్నారు. పనిలో పనిగా దేవాలయాలనూ సందర్శిస్తున్నారు.