చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా తమిళ్ డైరెక్టర్ ఎం.త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డుపక్కన అనాథ శవంలా ఆయన మృతదేహం పడిఉండడం మనసును కలిచివేస్తోంది. కోలీవుడ్ లో విజయ్ కాంత్, ప్రభు లాంటి హీరోలతో ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగంకావల్’ సినిమాలను తెరకెక్కించిన ఎం.త్యాగరాజన్ గురువారం ఉదయం ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డుపక్కన శవంలా కనిపించారు. ఆయనను పలువురు స్థానికులు గుర్తుపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేకపోతే అనాథ శవంలానే మున్సిపాలిటీ వారు తీసేసేవారని పలువురు వాపోయారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ తెచ్చుకున్న ఈయన రెండు మూడు చిత్రాల తరువాత కనుమరుగయ్యారు. ఆ తరువాత కూడా సినిమా మీద ఉన్న ఇష్టంతో చెన్నైలోని ఏవీఎం స్టూడియో వద్దే ఉండేవారు. కరోనా తరువాత రోడ్డుపక్కన ఏది దొరికితే అది తిని బతికేవాడని, ఇప్పుడు కూడా స్టూడియో ముందే చనిపోవడం బాధగా ఉందని అక్కడి స్థానికులు చెప్తున్నారు.