ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ కల్పన, అభూత కల్పనతో సాగుతూనే సైన్స్ కూ పెద్ద పీట వేస్తూ చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. తాజాగా నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన విశ్వంలోని అద్భుతమైన ఫోటోలను ఇలా విడుదల చేయగానే, అలా క్రిస్టఫర్ నోలాన్ ను హాలీవుడ్ జనాలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, నోలాన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’లో కథ మొత్తం అంతరిక్షంలోని ఓ గ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే క్రిస్టఫర్ సైతం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రీకరించిన పిక్స్ ను చూడగానే తన ఆలోచనలో ఓ కొత్త కథకు రూపకల్పన చేశానని అంటున్నాడు. కాలంతో పరుగులు తీయడమంటే ఇదే కాబోలు! ‘నాసా’ అలా పిక్స్ విడుదల చేసిందో లేదో, నోలాన్ ఇలా కథ అల్లేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన లండన్ లో ఇంగ్లిష్ లిటరేచర్ లో స్పెషలైజ్ చేశాడు. కాబట్టి కథలు ఇట్టే అల్లేసుకోగలడు. అది కాదు ఇక్కడ విశేషం! ఆ కథలో భారతీయతను మిళితం చేయబోవడమే అసలు విశేషం!!
రెండేళ్ళ క్రితం ఆయన ‘టెనెట్’ అనే సైన్స్ ఫిక్షన్ విడుదల చేశాడు. అందులో కొంతభాగం ఇండియాలో చిత్రీకరించారు. ఆ సినిమాలో మన బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో భారతీయ సంస్కృతి సంప్రదాయంపై నోలాన్ ఆసక్తి పెంచుకున్నాడు. న్యూటన్ కంటే ముందే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని భారతీయ ఖగోళ శాస్త్రవేత్త రెండవ బ్రహ్మగుప్త కనుగొన్నాడు. న్యూటన్ కంటే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే బ్రహ్మగుప్త ఆ ఖగోళ సత్యాన్ని లోకానికి చాటాడు. ఈ మధ్య కాలంలోనే ఈ వాస్తవాన్ని బ్రిటన్ సైన్స్ అకాడమీ సైతం గుర్తించింది. ఆ అంశంతోనే నోలాన్ ఓ కథ రాసుకున్నాడట. ఇప్పుడు జేమ్స్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను చూశాక మరో కొత్త ఆలోచన కూడా వచ్చిందట! ఆ రెండు అంశాలను మిళితం చేసి తనదైన రీతిలో నోలాన్ ఓ కథ తయారు చేస్తాడట. మరి ఆ కథతో తెరకెక్కే సినిమా ఎలా ఉంటుందో? ఎప్పుడు జనం ముందుకు వస్తుందో?