ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా భాగం కానున్నాడట! దిల్‌రాజు ఇప్పటివరకూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్ని నిర్మించాడు. తాజాగా NBK108కి సహ-నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. షైన్ స్క్రీన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఇప్పుడీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. దిల్‌రాజు రాకతో ఈ సినిమా బడ్జెట్ కాస్త పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, బాలయ్య పుట్టినరోజు సందర్భంగానే NBK108 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కుదరలేదు. అనిల్ రావిపూడి ఈ చిత్రం కోసం బాలయ్యకు ఓ కొత్త గెటప్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్టుని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. పనిలోపనిగా, నటీనటుల్ని కూడా ఎంపిక చేస్తున్నాడు. ఆల్రెడీ ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీలాని ఫైనల్ చేశారు. కథానాయికతో పాటు కీలక పాత్రల కోసం పేరుగాంచిన నటుల్ని రంగంలోకి దింపుతున్నారు. తండ్రి, కూతురు బంధం నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు అనిల్ తన కామెడీ శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 45 ఏళ్ల తండ్రి పాత్రలో కనిపించనున్నారు.