Dhakshina Murthy: ‘సంసారం సంసారం.. ప్రేమ సుధా తీరం.. నవజీవన సారం..’ అన్న మధురాన్ని 1950లో ‘సంసారం’ కోసం పలికించిన సుస్వరాల సుసర్ల దక్షిణా మూర్తి స్వరప్రయాణం తెలుగువారి మది పులకింపచేస్తూ సాగింది. గానకోకిల లతామంగేష్కర్ స్వరవిన్యాసాలను తెలుగులో తొలుత వినిపించిందీ ఆయనే. ‘సంతానం’లో లత పాడిన ‘నిదుర పోరా తమ్ముడా…’ గానం ఈ నాటికీ సంగీత ప్రియులను మురిపిస్తూనే ఉంది. ‘ఇలవేల్పు’ లోనూ ‘చల్లని రాజా ఓ చందమామ..’ పాటతో నిజంగానే ప్రేక్షకుల మదిలో చల్లని జాబిలి వెన్నెలను నింపారు సుసర్ల. ‘నర్తనశాల’లో ‘నరవరా.. కురువరా..’ అంటూ అలరించినా, ‘సలలిత రాగసుధారస సారం..’ చిలికించినా, ‘జననీ శివకామినీ..’ అనే భక్తిభావం పలికించినా సుసర్ల వారికే చెల్లింది. ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ‘శివ గోవింద గోవింద.. హరిః ఓం.. హరి గోవింద గోవింద..’ అని పరవశింప చేసిన సుసర్ల వారి బాణీని ఎవరు మాత్రం మరచిపోగలరు?
సుసర్ల దక్షిణామూర్తి 1921 నవంబర్ 11న కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో జన్మించారు. ఆయనకు వారి తాత దక్షిణామూర్తి పేరే పెట్టారు. సుసర్ల వారి తాత దక్షిణామూర్తి విఖ్యాత సంగీతనిధి త్యాగరాజస్వామి వారి శిష్యపరంపరలోని వారు. తాత పోలికలే మనవడికి వచ్చాయని దక్షిణామూర్తిని అనేవారు. దక్షిణామూర్తి తండ్రి కృష్ణబ్రహ్మ శాస్త్రి సంగీత విద్యాంసులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న సుసర్ల, తరువాత శాస్త్రీయ సంగీతంలో పట్టా పుచ్చుకున్నారు. హెచ్.ఎమ్.వి. సంస్థలో హార్మోనియం వాయిస్తూ కొంతకాలం పనిచేశారు సుసర్ల. తరువాత ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గానూ కొనసాగారు. ఆ పై చిత్రసీమకేసి అడుగులు వేశారు. సి.ఆర్.సుబ్బురామన్ స్వరకల్పనలో రూపొందిన ‘లైలా- మజ్ను’, ‘దాసి’, ‘శ్రీలక్ష్మమ్మ కథ’ వంటి చిత్రాలలో గాయకునిగా అలరించారు. తరువాత ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నటించిన ‘సంసారం’ చిత్రానికి సుసర్ల సమకూర్చిన సంగీతం వీనులవిందు చేసింది. డి.యోగానంద్ దర్శకత్వంలో ఎల్వీ ప్రసాద్ నిర్మించిన ‘ఇలవేలుపు’తో రఘునాథ్ పాణిగ్రాహిని గాయకునిగా తెలుగువారికి పరిచయం చేశారు. తెలుగులో కన్నా తమిళనాట సుసర్ల పేరు విశేషంగా వినిపించింది. మోడరన్ థియేటర్స్ టి.ఆర్.సుందరం తమిళ, తెలుగు భాషల్లో చిత్రాలు నిర్మించేవారు. అలాగే సింహళంలోనూ ఆయన సినిమాలు తెరకెక్కించారు. 1953లో ‘సుజాత’ అనే సింహళ చిత్రానికి సంగీతం సమకూర్చి, శ్రీలంకవాసులనూ పులకింప చేశారు సుసర్ల. ఆ తరువాత కూడా ఓ అరడజను సింహళ చిత్రాలకు స్వరాలు అందించారాయన.
మాతృభాష తెలుగులో ‘హరిశ్చంద్ర, వీరకంకణం, భలే బావ, సంకల్పం, బండరాముడు, కృష్ణలీలలు, అన్నపూర్ణ, నర్తనశాల, శ్రీమద్విరాట పర్వము, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ మొదలైన చిత్రాలకు స్వరకల్పన చేసి అలరించారు సుసర్ల. యన్టీఆర్ చిత్రాలకే ఎక్కువగా సుసర్ల సంగీతం సమకూర్చడం విశేషం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ తొలి చిత్రం ‘అన్నపూర్ణ’కు సుసర్ల స్వరాలే ప్రాణం పోశాయి. ‘నర్తనశాల’లాగే విరాటపర్వం ఆధారంగా యన్టీఆర్ తెరకెక్కించిన ‘శ్రీమద్విరాటపర్వము’ చిత్రానికి అదే పనిగా సుసర్లతోనే స్వరకల్పన చేయించారు నందమూరి. ఆ చిత్రం తరువాత యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ కు కూడా సుసర్ల సంగీతం సమకూర్చారు. ఇందులోని బ్రహ్మంగారి తత్వాలకు సుసర్ల పేర్చిన బాణీలు ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉన్నాయి. అప్పటి దాకా సుసర్ల స్వరకల్పన చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు, ‘బ్రహ్మంగారి చరిత్ర’ ఒక్కటీ ఓ ఎత్తుగా నిలచింది. ఈ సినిమాతో గాయకుడు రామకృష్ణకు సైతం ఎనలేని పేరు లభించింది. సుసర్ల స్వరరచనతో పరిచయం ఉన్న వారందరికీ ఆయన సంగీతం మరపురానిది. మరచిపోలేనిది. సుసర్ల స్వరవిన్యాసాలు వినేకొద్దీ సంగీత ప్రియుల్లో సరికొత్త అనుభూతులు కలుగుతూనే ఉంటాయి.
(నవంబర్ 11న సుసర్ల దక్షిణామూర్తి జయంతి)