Gopichand: మాచో స్టార్ గోపీచంద్ 30వ సినిమా ‘రామబాణం’. లాస్ట్ ఫ్రై డే ఈ సినిమా జనం ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ బరిలో దర్శకుడు శ్రీవాసు సంధించిన ఈ ‘రామబాణం’ గురి తప్పి ఎటో వెళ్లిపోయింది. ఈ సినిమా కోసం చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగానే ఖర్చు పెట్టింది. బట్… కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ఇదిలా ఉంటే… ఈ మధ్య కాలంలో ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఓ సరదా మాట బాగా వినిపిస్తోంది. డైరెక్టర్ తనకు నచ్చిన సీన్స్ లెంగ్త్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా షూట్ చేసేస్తే… ఒకవేళ అవి ఎడిటింగ్ లో పోయినా… ఆ తర్వాత యూ ట్యూబ్ లో పెట్టుకోవచ్చు అనేది! ఎందుకంటే గతంలో అలాంటి ఎడిటెడ్ సీన్స్ ను పక్కన పడేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి నిర్మాణ సంస్థకూ ఓ సొంత యూ ట్యూబ్ ఛానెల్ ఉండటంతో వాటిని పోస్ట్ చేసి… ఆ రకంగానూ ఎంతో కొంత ఆదాయం సంపాదించుకుంటున్నారు.
తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అదే పనిచేసింది. ‘రామబాణం’లో హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతికి సంబంధించి దాదాపు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఇంట్రడక్షన్ సీన్ ఎడిటింగ్ తో పోయింది. అయితే దాన్ని ఇప్పుడు యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. కోల్ కత్తాలో అండర్ వరల్డ్ డాన్ గా రాణించడంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనూ తన సత్తా చాటుతూ ఉంటాడు గోపీచంద్. అతను నిర్మించే విల్లాలో తనకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి హీరోయిన్ ఆఫీస్ కు వస్తుంది. ఈ సన్నివేశాన్ని దర్శకుడు శ్రీవాసు వినోదభరితంగా తీశాడు. కానీ లెంగ్త్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా దీన్ని కట్ చేశారు. ఇప్పుడీ సన్నివేశాన్ని యూ ట్యూబ్ లో చూస్తుంటే… బాగానే ఉందే అనిపిస్తోంది! మరి ఇది సినిమాలో ఉండి ఉంటే… రిజల్ట్ మరీ ఇంత ఘోరంగా ఉండేది కాదేమో! అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు కదా!!