చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని పవిత్రమైన మాడవీధుల్లో సంచరించింది. దాంతో పెళ్ళికాగానే వివాదాలకు తెరతీసింది నయన్.

అంతకు ముందు ప్రేమాయణాలతో సంచలనం రేకెత్తించిన నయన్, పెళ్ళయ్యాక కూడా అదే పంథాలో సాగడమే విశేషం! తొలిప్రేమలో బలముందిలే అన్నట్టుగా శింబునూ ప్రేమించే రోజుల్లో ‘లిప్ లాక్’ చేస్తూ ఫోటో తీసుకొని మరీ అందరికీ ప్రదర్శించింది. ఆ ముచ్చట అయిన తరువాత ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో పరిణయానికి పరుగు తీసింది. అతని కోసం మతం కూడా మార్చుకుంది. ఎందుకనో ఏడడుగులు వేయలేకపోయింది. ‘శ్రీరామరాజ్యం’ పూర్తి కాగానే సినిమాలకు స్వస్తి అనీ ప్రకటించి, అభిమానులకు ఆందోళన కలిగించింది. సరే ఫ్యాన్స్ కోసం మళ్ళీ నటిస్తానని చెప్పేసి, ఆ తరువాత విజయయాత్ర మొదలెట్టింది. వరుస విజయాలు రాగానే ఈ ‘లేడీ సూపర్ స్టార్’ అంతకు ముందు చేసినవన్నీ మరచిపోయారు జనం.

ఈ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధితోనూ చెట్టాపట్టాలేసుకు తిరిగిందనీ అన్నారు. నటి రాధిక అన్నయ్య రాధారవి ఎందుకనో అమ్మడిపై అక్కసు పెంచుకున్నాడు. ఆమె సిగ్గు పడితే ‘పతిత’ సిగ్గు పడినట్టు ఉంటుందనీ చాటింపేశాడు. నేనేం తక్కువ కాదు అన్నట్టు నయన్ కూడా ఆయనకు “స్త్రీ ద్వేషి అనే పదానికి అతను రోల్ మోడల్” అంటూ కితాబు ఇచ్చింది. కేరళలో ఓ గుడిలో నయనతారకు ప్రవేశం లేదని ఆలయ కార్యనిర్వాహకులు అడ్డు చెప్పారు. కారణం, ఆమె ‘సెల్వార్ కమీజ్’ వేసుకోవడమే! ఆ డ్రెస్ కూడా మన సంప్రదాయ దుస్తులే కదా అన్నది నయన్ వాదన. కానీ, చీర కట్టుకోవాలన్నది వారి నిబంధన. నయన్ ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తూ కామెంట్స్ చేసింది. తరువాత నయన్ కు ఆ ఆలయ కార్యనిర్వాహక వర్గం చీర బహుమానంగా పంపించారు.

ఇలా పలు వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న నయన్, కొన్నేళ్ళుగా దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తూ వచ్చింది. అదుగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ వారి పెళ్ళి వార్తలు వినిపించేవి. మొత్తానికి ఆనందంగా విఘ్నేష్ తో పెళ్ళయిపోయింది. అలా అయ్యిందో లేదో ఇలా మరో కాంట్రవర్సీకి తెరతీసింది నయన్. అందునా సాక్షాత్తు కలియుగదైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలలో మాడవీధుల్లో పాదరక్షలతో నయన్ తిరగడం పలువురి మనోభావాలను దెబ్బ తీస్తోంది. ఈ విషయంలో ఎప్పటిలాగే దూకుడు చూపిస్తుందా? లేక లెంపలు వేసుకొని తప్పు ఒప్పుకుంటుందా? చూడాలి ఏం చేస్తుందో?