పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఇటీవల రిలీజ్ అయ్యి విజయవంతమైన విషయం తెలిసిందే. భారీగా కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాల వలన కొందరి మనోభావాలను దెబ్బతీశారని కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా భీమ్లా నాయక్ లో కుమ్మరి కులస్థులను అవమానించారని తెలుపుతూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం పురుషోత్తం గుంటూర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సినిమాలోని ఒక సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నడంతో.. మాకు అన్నం పెట్టే కుల చక్రాన్ని కాలితో తన్నడం బాధ అనిపించిందని, కుమ్మరి వారు అంటే అంత చులకన గా చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఆ సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలని , లేకపోతే తీవ్ర పరిణామాలు మేకర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని పురుషోత్తం డిమాండ్ చేశారు.