ఆంధ్రప్రదేశ్ లో ‘వకీల్ సాబ్’ కి ప్రభుత్వానికి మధ్య పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజకీయరంగు పులుముకున్న ఈ వివాదం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విడుదల సయమంలో టిక్కెట్ రేట్లు పెంచి అమ్మట అనేది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే పవన్ జనసేన అధిపతిగా బిజెపీ తో పొత్తు పెట్టుకుని రాజకీయం నడుపుతున్న సందర్భంగా ఆయన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతే కాదు టికెట్ల రేట్లు పెంచకుండా చూడాలంటూ అదనపు కలెక్టర్లు థియేటర్లకు ఆదేశాలు జారీచేశారు. సినిమా టికెట్ల రేట్లు ఎంత ఉండాలనే విషయాన్ని కూడా అధికారికంగా జీవో ద్వారా తెలియిచేశారు. దీంతో సినిమాకు సంబంధించిన వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం విడుదలైన తొలి నాళ్ళలో టికెట్ రేటు పెంచుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. దీనిని ప్రస్టేజ్ గా తీసుకున్న ప్రభుత్వం మరోసారి కోర్టు తలుపులు తట్టింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెంచుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని… వకీల్ సాబ్ కు కూడా ఆ వెసులుబాటు కల్పించాలని సినిమావారి తరపు న్యాయవాదులు వాదించినా… సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ మూడవ రోజు నుంచి అంటే ఆదివారం నుంచి సాధారణ రుసుమునే అనుమతించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దీనిని ఛాలెంజ్ చేస్తూ మరోసారి కోర్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యారు ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లు. సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారట. మరి చిలికి చిలికి ‘వకీల్ సాబ్’ వర్సెస్ గవర్నమెంట్ గా మారిన ఈ కోర్టు ఫైట్ లో అంతిమ విజయం ఎవరిదనేది తేలాల్సిఉంది.