తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా విడుదలకు ముందే ప్రముఖ దర్శకుడు క్రిష్ మూవీకి ఎంపిక అయ్యి, షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ‘ఉప్పెన’ తరహాలోనే ఈ రెండోది కూడా థాట్ ప్రొవోకింగ్ మూవీ కావడం విశేషం. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన బహుమతి పొందిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే… ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సైతం వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాను మొదలెట్టారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ దర్శకుడు గిరీశాయ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇలా బిజీబిజీగా ఉంటున్న వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ ఫోటో షూట్ చేశాడు. దానికి సంబంధించిన మూడు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ క్రేజీ యంగ్ హీరో పెట్టిన ఫోటోలు చూసి కేవలం నలభై నిమిషాల్లో నలభై వేలమంది లైక్స్ కొట్టేశారు. మొత్తానికీ అన్న సాయిధరమ్ తేజ్ ను మించిన క్రేజ్ ను వైష్ణవ్ సంపాదించుకుంటున్నాడు అనిపిస్తోంది. అన్నట్టు వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ ఏప్రిల్ 13 మంగళవారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.