ఇవాళ బుల్లితెరలో ఏదైనా కార్యక్రమం ఏ స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుందనే అంశానికి గీటురాయి టీఆర్పీనే. దానిని ఆధారంగా బుల్లితెర వీక్షకులు తెలుగులోని ఏ యే సినిమాలను ఎక్కువగా ఆదరించారనే విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకానొక సమయంలో వెండితెరపై పెద్దంత ప్రభావం చూపని సినిమాలను కూడా బుల్లితెర వీక్షకులు పట్టం కట్టిన సందర్భం కనిపిస్తుంది. ఇక వివరాలలోకి వెళితే, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ కు అత్యధికంగా 29.4 టీఆర్పీ దక్కింది. ఇది అగ్రస్థానంలో నిలువగా, మహేశ్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో అదే సమయంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 23.4 టీఆర్పీ లభించింది. ఇది రెండో స్థానం పొందింది. ఇక ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి -2’ చిత్రం 22.7తో మూడో స్థానం దక్కించుకుంది. నాలుగో స్థానంలో మహేశ్ బాబు, – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ 22.54 టీఆర్పీ పొంది నిలువగా, వెండితెరపై పెద్దంత సందడి చేయని ‘దువ్వాడ జగన్నాథం’ 21.7 టీఆర్పీతో ఐదు స్థానం పొందడం విశేషం. ఆరో స్థానంలో 21.54 టీఆర్పీతో ‘బాహుబలి’ నిలిచింది. విశేషం ఏమంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ప్రేమకథా చిత్రం ‘ఫిదా’ 21.31 టీఆర్పీతో ఏడో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ప్లేస్ విజయ్ దేవరకొండ – పరశురామ్ మూవీ ‘గీతాగోవిందం’కు 20.80 టీఆర్పీతో దక్కింది. చివరి రెండు స్థానాలు వరుసగా ‘జనతా గ్యారేజ్ (20.69), ‘మహానటి’ (20.21) దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు రెండేసి ఉండగా, ఎన్టీయార్, వరుణ్ తేజ్ చిత్రాలు ఒక్కొక్కటి ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ టీఆర్పీ రేటింగ్స్ ను ఏ చిత్రాలు మార్చుతాయో చూడాలి.