Box Office Posters: టాలీవుడ్‌లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?

Tollywood

Tollywood

Box Office Posters: ఒకప్పుడు సినిమా హిట్, సూపర్ హిట్ అనే ముద్ర ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో రన్ ఆధారంగా పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీ వర్గా్ల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నిర్మాతలు, హీరోలు.. ఆ మార్క్ అందకపోయినా “100 కోట్లు” పోస్టర్లు రిలీజ్ చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. గతంలో రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాపై ఈ చర్చ మరింత ఊపందుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా రూ.80 కోట్లకు చేరువలో వసూళ్లు సాధించిందనే ప్రచారం ఉన్న సమయంలో రూ.100 కోట్ల గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే తరహా చర్చ గతంలో రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమా విషయంలోనూ జరిగింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా దాదాపు రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ, మేకర్స్ రూ.100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో అప్పట్లోనూ ట్రోలింగ్ జరిగింది. రవితేజ కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ చిత్రంగా చూపించేందుకు ఈ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారనే విమర్శలు వినిపించాయి. అలాగే ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కూడా రూ.100 కోట్లకు చేరువలో ఆగిపోయిందని, అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో అతిశయోక్తి ప్రచారం జరిగిందనే కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ‘లెనిన్’ విషయంలో కూడా ఇదే ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు లెనిన్, ‘అనగనగా ఒక రాజు’, ‘ధమాకా’ వంటి చిత్రాల కలెక్షన్ పోస్టర్లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా అసలు వసూళ్ల కంటే భారీ సంఖ్యలను మేకర్స్ ప్రచారం చేయడం వల్ల అభిమానుల కంటే యాంటీ ఫ్యాన్స్‌కు ట్రోలింగ్‌కు అవకాశం ఇస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ కలెక్షన్లకు బదులుగా ప్రచార పోస్టర్లపై ఆధారపడటం హీరోల మార్కెట్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.