రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి తాజాగా చిత్ర యూనిట్ ‘సహానా సహానా’ అంటూ సాగే ఒక మెలోడియస్ రొమాంటిక్ డ్యూయెట్‌ను విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన వింటేజ్ డేస్ మళ్ళీ గుర్తొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు. లిరికల్ వీడియోను గమనిస్తే, ఈ పాటను యూరప్‌లోని అత్యంత సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. సంగీత దర్శకుడు థమన్ తనదైన శైలిలో అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించారు. ఈ పాటలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ కాలు కదిపింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా, విజువల్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ప్రభాస్ తనదైన గ్రేస్ అండ్ ఎనర్జీతో వేసిన సింపుల్ స్టెప్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి.
Also Read: Aadi Saikumar : షూటింగ్ లో హీరోకి గాయాలు.. అయినా వెనక్కి తగ్గకుండా?
ఈ పాట విడుదలైన తర్వాత నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభాస్ సుమారు రెండేళ్ల క్రితం తన మోకాలికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ‘సహానా సహానా’ పాటలో ఆయన వేసిన స్టెప్స్ గమనిస్తే, మోకాలి మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా కొరియోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. కొందరు అభిమానులు ఈ పాట ప్రభాస్ సర్జరీ జరిగిన కొత్తలోనే షూట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూనే, ఇలాంటి సింపుల్ అండ్ క్లాసీ స్టెప్స్‌తో మ్యాజిక్ చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అమోఘంగా ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్, జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
Also Read:Sukumar : ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ పై సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రేమకథా చిత్రం’ వంటి బ్లాక్ బస్టర్ హారర్ కామెడీని అందించిన మారుతి, ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇటీవల బాలీవుడ్‌లో కూడా హారర్ కామెడీ సినిమాలకు ఆదరణ పెరుగుతుండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారనుంది.