Tammareddy Bharadwaja:ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ పై వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఏ ముహూర్తాన టీజర్ ను రిలీజ్ చేశారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ట్రోలర్స్ నోటిలో నానుతూనే ఉంది. టీజర్ నచ్చలేదని, ప్రభాస్ లుక్ బాలేదని, గ్రాఫిక్స్ బాలేదని, సైఫ్ లుక్ పై వివాదాలు.. ఇలా ఒకటి కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని కొంతమంది, హనుమంతుడి గెటప్ కు లెదర్ ను వాడారని మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇక వీరితో పాటు అసలు ఇది ప్రభాస్ సినిమానా..? ఇది ఒక టీజరా అని విమర్శించారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సినీ పరిశ్రమలో ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చే తమ్మారెడ్డి ఈ టీజర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఆదిపురుష్ టీజర్ గురించి మాట్లాడుతూ “ప్రభాస్ సినిమా అని టీజర్ చూసాను. ఇది టీజరా..? రూ.500 కోట్లు పెట్టి సినిమా తీశారు. కానీ, టీజర్ నిరాశపరిచింది. యానిమేటెడ్ సినిమాలు అనిపిస్తోంది. ఇలాంటి యానిమేషన్ సినిమా టెస్సి దీన్ని పాన్ ఇండియా సినిమా అని ఎలా అంటారో అర్ధం కావడం లేదు.
ఇక ఈ సినిమా అందరు రజినీకాంత్ కొచ్చయాడీన్ తో పోలుస్తున్నారు. కానీ 3డి లో చూస్తే ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందని మేకర్స్ చెప్తున్నారు. 2డీ నుంచి 3డీ కి మారినంత మాత్రం గెటప్స్, కాస్ట్యూమ్స్ అన్ని మారిపోతాయా..? ఒకవేళ అలా మారితే మంచిదేకదా.. సినిమా హిట్ అందుకుంటే అంతకన్నా కావాల్సిందేమి లేదు. అయితే రాముడిని చూపించనట్లే రావణాసురుని చూపించాల్సింది.. రావణుడు బ్రాహ్మణుడే.. ఆయనకు ఎన్నో చోట్ల గుడులు ఉన్నాయి. ఇక ఈ ట్రోల్స్ సినిమాను అల్లరి చేయడానికి చేయడం లేదు. సినిమా మంచిగా రావాలని కోరుకుంటూ చెప్తున్నారు. ఆ రిపేర్లు ఏవో మంచిగా చేసి సినిమా బావుండాలని కోరుకుంటున్నాను”అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.