కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయి చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం.. ‘ది రాజా సాబ్’, ‘ఓజీ’, ‘అఖండ 2’, ‘శబ్దం’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు పని చేస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు ప్రకటించాల్సి ఉంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే తమన్ ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అతను చెప్పాలనుకొన్న విషయాన్ని, ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇటీవల సినిమాలపై నెగిటివ్ రివ్యూలు, కామెంట్స్ చేసే వారిపై ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. అయితే ఇప్పటి వరకు సింగిల్ గానే ఉన్న తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం యువత ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాకు బాగా అలవాటు పడి ఎవరికి వారు ప్రైవసీ కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా తర్వాత అమ్మాయిలు, అబ్బాయిల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. వీరికి పెళ్లిపై సరైన ఒపినియన్ కానీ సీరియస్ నెస్ కానీ లేదు. అందుకే ఇటీవల కాలంలో పెళ్లి అయిన కొన్ని నెలలకే డైవర్స్‌లు జరిగిపోతున్నాయి. యువత ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచన లేకుండా పోయింది. మరికొందరైతే తనదే నడవాలని కూడా మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. వైవాహిక జీవితం అంటే ఇద్దరు కలిసి ఒక నావ మీద ముందుకు వెళ్లడం.. కానీ ఎవరికి వారు ఎడమొఖం, పెడమొఖం అంటే.. ఈ జీవితం అనే నావ నడి సంద్రంలో మునిగిపోతుంది. ముఖ్యంగా మానవ సంబంధాలను దెబ్బ తీయడానికి ఇన్స్‌టాగ్రామ్ ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను. ఒక పాజిటివ్ రీల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఎవరికీ తెలియదు. కేవలం పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగితే.. మోహమాటం లేకుండా.. పెళ్లి వద్దని చెప్తా’ అని పేర్కొన్నాడు తమన్.