నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సెన్సేషన్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ భారీ విజయంపై చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తాజాగా మీడియాతో ముచ్చటించి, సినిమా మ్యూజిక్ వెనుక ఉన్న శ్రమను వివరించారు.
సినిమా విజయం గురించి థమన్ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ దశలోనే మాకు కొన్ని హై మూమెంట్స్ ఉంటాయని తెలుసు. బోయపాటి సామాన్యమైన దర్శకుడు కాదు. ఒక కమర్షియల్ సినిమాను ప్రేక్షకులు నమ్మేలా తీయడం, దాన్ని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టడం గొప్ప విషయం. ముఖ్యంగా సనాతన ధర్మం వంటి సున్నితమైన కంటెంట్‌ను తీసుకుని, దాన్ని బాలయ్య వంటి మాస్ పవర్ ఉన్న హీరోతో కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడం అసాధారణం. ఆ క్రెడిట్ అంతా బాలయ్య బాబుకు, బోయపాటికే దక్కుతుంది,” అని అన్నారు.
Also Read: Malaika: బ్రేకప్ తర్వాత మలైకా అరోరా కొత్త రిలేషన్ షిప్? 17 ఏళ్ల చిన్నోడితో డేటింగ్
మొదటి భాగం ‘అఖండ’లో మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉంటే, ‘తాండవం’లో దాన్ని మించి ఇవ్వాలని థమన్ చాలా శ్రమించారట. ప్రేక్షకులను థియేటర్లలో ఒక రకమైన ‘ట్రాన్స్’ (పరవశం)లోకి తీసుకువెళ్లేలా మ్యూజిక్ ఉండాలని ప్లాన్ చేశారు. కేవలం శివుని మంత్రాలను ఎంత కొత్తగా వినిపించవచ్చు అనే దానిపై దాదాపు 20 రోజులు కసరత్తు చేశామని థమన్ వెల్లడించారు. సినిమాలో ఏవైనా ఏఐ టూల్స్ వాడారా అన్న ప్రశ్నకు థమన్ తనదైన శైలిలో చమత్కరించారు. “మేము టెక్నాలజీని నమ్మలేదు.. ‘శివాలజీ’ని నమ్మాము,” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. కృత్రిమ మేధ కంటే దైవత్వం మరియు సహజమైన సంగీత సాధనకే తాము ప్రాధాన్యతనిచ్చామని ఆయన స్పష్టం చేశారు. థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయానికి ఒక ప్రధాన వెన్నెముకగా నిలిచిందని ప్రేక్షకులు మరియు సినీ విమర్శకులు ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు.