నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా ప్రయాణం మరియు తన అనుభవాలను పంచుకున్నారు.
Also Read:SS Thaman: అఖండ తాండవం కోసం టెక్నాలజీని నమ్మలేదు.. శివాలజీని నమ్మం
‘అఖండ’ మ్యూజిక్ అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘తాండవం’ కోసం చాలా ప్రయోగాలు చేశామని థమన్ తెలిపారు. ఈ సినిమాలో సర్వేపల్లి సిస్టర్స్, లెజెండరీ సింగర్ సుబ్బలక్ష్మి గారి మనవరాలు, కనకవ్వ వంటి వైవిధ్యమైన గాత్రాలను పరిచయం చేశారు. కథలోని గాఢతకు, ఆ ఆధ్యాత్మికతకు కొత్త గొంతులు తోడైతేనే ఆశించిన ఫలితం వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సినిమా తన వ్యక్తిగత జీవితంపై చూపిన ప్రభావం గురించి థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అఖండ నాకు జీవితంలో ఒక బ్యాలెన్స్ ఇచ్చింది. మనం గుడికి వెళ్తే మనసుకి ఎంతటి ప్రశాంతత కలుగుతుందో, ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అలాంటి అనుభూతే కలిగింది. ఇది కేవలం సక్సెస్ మాత్రమే కాదు, నాలో బాధ్యతను కూడా పెంచింది” అని పేర్కొన్నారు.
Also Read:Nidhi Agarwal: నిధి అగర్వాల్’తో అసభ్య ప్రవర్తన.. వారిపై కేసు నమోదు?
సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటంపై స్పందిస్తూ, అది తనకు పెద్ద షాకింగ్ అని థమన్ అన్నారు.
“సినిమా వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదు. మా బాధంతా అభిమానుల గురించే. ఎంతో దూరం నుంచి వచ్చి, థియేటర్లను ముస్తాబు చేసి ప్రీమియర్స్ కోసం ఎదురుచూసిన వారు నిరాశతో వెనుతిరగడం బాధించింది. అయితే, సినిమా కంటెంట్‌పై మాకు గట్టి నమ్మకం ఉంది. సినిమా ఎప్పుడు వచ్చినా దాని బలం తగ్గదని మాకు తెలుసు. ఆ నమ్మకం ఈరోజు నిజమై, అఖండ విజయం సాధించడం సంతోషంగా ఉంది” అని ఆయన వెల్లడించారు. చివరగా, ఈ అద్భుతమైన విజయం క్రెడిట్ అంతా దర్శకుడు బోయపాటి శ్రీను మరియు ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ గారికి దక్కుతుందని థమన్ కొనియాడారు.