నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం మే 1, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
మీ పాత్ర గురించి చెప్పండి?
ఈ సినిమాలో నేను మృదుల అనే పాత్రలో కనిపిస్తాను. అర్జున్ సర్కార్ పాత్ర గురించి మీరు టీజర్, ట్రైలర్‌లలో ఇప్పటికే చూశారు. అది తీవ్రమైన హింసతో కూడిన ఒక ఇంటెన్స్ పాత్ర. ఈ పాత్రలో హింసతో పాటు అనేక కోణాలు ఉన్నాయి. మృదుల పాత్ర అర్జున్ సర్కార్‌కి భిన్నంగా ఉంటుంది. అర్జున్ సర్కార్ మృదుల మాటలను తప్ప ఎవరి మాటలనూ పట్టించుకోడు. మృదుల ఒక స్వతంత్రమైన పాత్ర, దీనిలో అనేక లేయర్లు ఉన్నాయి. ఇది చాలా ఆసక్తికరమైన పాత్ర. సినిమా చూసినప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది.
కథలో మీ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంది?
సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌లలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత ఉండదు. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను అద్భుతమైన రచయిత. హిట్, హిట్ 2 సినిమాలను గమనిస్తే, ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత క్రమంగా పెరిగింది. కథలో హీరోయిన్ పాత్ర కూడా సమన్వయంతో ఉంటుంది. హిట్ 3లో హీరోయిన్ పాత్రను మరింత బాగా రూపొందించారు. కథతో ఈ పాత్రకు చాలా బలమైన సంబంధం ఉంది. సినిమా చూస్తే ఈ పాత్ర ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది.
ఈ పాత్రకు మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారు?
నన్ను నాని తెలుసు కదా సినిమా ఓపెనింగ్ లో చూశారు అక్కడ ఈ పాత్రకు నేనైతే కరెక్ట్ గా సెట్ అవుతానని చెప్పి ఆఫీసు నుంచి కాల్ చేయించారు. అలా నేను ఈ సినిమాలో భాగమయ్యాను.
నానితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
నాని సినిమాలన్నీ చూశాను. ఆయన సహజమైన నటుడు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం. చాలా సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. అలాంటి సౌకర్యవంతమైన వాతావరణం ఉంటే నటన కూడా చాలా అద్భుతంగా వస్తుంది.
మీరే డబ్బింగ్ చెప్పారని విన్నాం?
అవును. నా పాత్రకు నేనే చాలా ఇష్టంగా డబ్బింగ్ చెప్పాను. మొదట నా పాత్రకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చేయించారు. కానీ నేను దర్శకుడిని అభ్యర్థించి, నా పాత్రకు నేనే డబ్బింగ్ చేస్తానని చెప్పాను. డబ్బింగ్ చేశాను, దర్శకుడికి నా గొంతు నచ్చింది. నా మొదటి తెలుగు సినిమాకు నా స్వంత గొంతు ఉండటం చాలా ఆనందంగా అనిపించింది. కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలా డబ్బింగ్ చెప్పాను.
మీ తొలి తెలుగు సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం ఎలా అనిపిస్తోంది?
కథ విన్నప్పుడే ఈ సినిమాలో చాలా హింస, యాక్షన్ ఉంటాయని అనిపించింది. నిజానికి ఈ కథకు అలాంటి హింస, యాక్షన్ అవసరం. ఈ సినిమా జానర్ అలాంటిది. KGFలో కూడా హింస ఉంది, కానీ అది వేరే ప్రపంచం. హిట్ 3 మరో రకమైన ప్రపంచం. నేను ఇప్పటివరకు ఎక్కువగా హింస ఉన్న సినిమాలే చేశాను. KGFలోని డైలాగ్‌లా చెప్పాలంటే, “వైలెన్స్ ఐ డోంట్ లైక్, బట్ వైలెన్స్ లైక్స్ మీ” (నవ్వుతూ).
డైరెక్టర్ శైలేష్ కొలను గురించి?
నాకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చేయడం ఇదే మొదటిసారి. దర్శకుడు చాలా సహకరించారు. ప్రతిదీ వివరంగా వివరించారు, నాకు అన్నీ నేర్పించారు. ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి షూటింగ్ చేస్తారు. భవిష్యత్తులో ఆయన అద్భుతమైన సినిమాలు తీసి ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
మిక్కీ జే మేయర్ సంగీతం గురించి?
మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాకు సంగీతం అందించడం ఆయనకు కూడా కొత్త. అత్యుత్తమ సంగీతం ఇచ్చారు. ప్రేక్షకులు దీన్ని బాగా ఆస్వాదిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మొదటి పాట “ప్రేమ వెల్లువ” అద్భుతమైన హిట్ అయింది. అలాగే అనిరుద్ పాడిన పాట కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ షాను అద్భుతమైన విజువల్స్ అందించారు. మిగతా సాంకేతిక బృందం కూడా అత్యుత్తమ పనితీరు కనబరిచింది. సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది.
KGF 3లో మీరు కనిపిస్తారా?
KGF 3లో నేను ఉన్నానా లేదా అనేది చూసి తెలుసుకోండి (నవ్వుతూ).
రామాయణంలో సీత పాత్రను తిరస్కరించారని విన్నాం?
ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలి. మీడియాలో ఈ విషయంపై తప్పుడు సమాచారం తిరుగుతోంది. నేను సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. అది మాత్రమే నిజం. ఆ తర్వాత నాకు వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అసలు అలాంటి పాత్రను తిరస్కరించే స్థాయి నటిని నేను కాదు. నేను ఆడిషన్ ఇచ్చిన విషయం మాత్రమే వాస్తవం. చివరి నిర్ణయం సినిమా నిర్మాతలదే. ఆ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశారని మీడియా ద్వారానే తెలిసింది.
కొత్త సినిమాల గురించి?
తెలుసు కదా, ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది.