శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత కీలక పాత్రలు పోషించిన సినిమా ‘హంగామా -2’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ‘హంగామా’కు సీక్వెల్ కాదు. అయితే 2003లో వచ్చిన ‘హంగామా’లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ రిపీట్ అవుతున్నాయని, అందుకే ఈ పేరు పెట్టామని చెప్పారు ప్రియదర్శన్. విశేషం ఏమంటే… దాదాపు ఏడేనిమిదేళ్ళ తర్వాత ‘హంగామా -2’తో ఆయన బాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ‘అప్నే’ విడుదలైన 13 సంవత్సరాలకు శిల్పాశెట్టి వెండితెర మీద లీడ్ రోల్ ను పోషించింది.
Read Also : సురేష్ బాబుపై వెంకటేష్ అభిమానుల ట్రోలింగ్…!
ఇక తెలుగు, కన్నడ చిత్రసీమలో చక్కని గుర్తింపు పొందిన ప్రణీత ఇటీవలే వివాహం చేసుకుంది. ఆమె శ్రీమతిగా మారిన తర్వాత విడుదలవుతున్నమొదటి బాలీవుడ్ చిత్రమిది. ‘హంగామా -2’ను గత యేడాది ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో అంతరాయం ఏర్పడింది. ఈ యేడాది ఫిబ్రవరి నాటికి షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడక పోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 23న సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జూలై 1న విడుదల కాబోతున్న ట్రైలర్ ను మిస్ కావద్దంటూ, రిలీజ్ డేట్ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో శిల్పాశెట్టి పోస్ట్ చేసింది.