Michael: యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది. సందీప్ కిషన్ ప్రస్తుతం ‘మైఖేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో దివ్యాంశ కౌశిక్ తనతో రొమాన్స్ చేస్తోంది. రంజిత్ జయకోడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పరాజయాలు పలకరిస్తున్నా దీనిని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. సందీప్ కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. రెండు నెలల క్రితం విడుదలైన యాక్షన్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు…’ అనే పాట డిసెంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. దీనిని సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ పై చిత్రీకరించారు. విడుదలైన పోస్టర్ లో వీరిద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీని హైలైట్ చేశారు. దీనికి ముందు విడుదలైన సందీప్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేక పోయాయి.
Read also: Justice My Daughter: న్యాయం చేయండి.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు రాష్ట్రపతికి లేఖ..
2010లో ‘ప్రస్థానం’తో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ కి 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఒక్కటే కెరీర్ లో హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా తర్వాత ‘టైగర్, శమంతకమణి, నిను వీడని నీడను నేనే, ఎ1 ఎక్స్ ప్రెస్’ పర్వాలేదనిపించాయి. తమిళంలో ‘మా నగరం, మాయావన్’ పేరు తెచ్చాయి. ఇక ‘డి ఫర్ దోపిడి, రారా కృష్ణయ్య, జోరు, బీరువా, రన్, ఒక్క అమ్మాయి తప్ప, నక్షత్రం, కేరాఫ్ సూర్య, మనసుకు నచ్చింది, నెక్ట్స్ ఏంటి?, తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్, వివాహభోజనంబు, కాసడతప్పర, గల్లీరౌడీ’ సినిమాలు ఇలా వెళ్ళి అలా తిరుగు టపా కట్టేశాయి. దీంతో సందీప్ కిషన్ సినిమా అంటేనే బయ్యర్లు పరార్ అయిపోతున్నారు. దీంతో ‘మైఖేల్’ సినిమా కూడా నత్తనడక నడుస్తోంది. ఈ సినిమాతో పాటు ‘ఊరు పేరు భైరవకోన’లోను, ధనుష్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’లోనూ మరో తమిళ చిత్రం ‘నరకాసురన్’లో నటిస్తున్నాడు సందీప్. ఇప్పుడు సందీప్ ఆశలన్నీ ‘మైఖేల్’ పైనే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘మైఖేల్’లో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. మరి విజయ సేతుపతి టచ్ అయినా సందీప్ కెరీర్ ని నిలబెడుతుందేమో చూడాలి.
Pakistan: ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు