తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, మాజీ బీజేపీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన శ్రీ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహం ఫిల్మ్‌నగర్ నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన అంత్యక్రియలు కన్నీటి వాతావరణంలో జరిగాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
Also Read:Kota Srinivasa Rao : కన్నీటి వీడ్కోలుతో ముగిసిన కోట అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, X వేదికగా సంతాప సందేశం పంపారు. “శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి,” అని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు.