తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13 తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
Also Read: China: మాజీ ప్రియురాలిని మరిచిపోవడానికి యువకుడికి వింత ఆలోచన! 6 రోజులు ఏం చేశాడంటే..!
1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు, నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. ‘హలో బ్రదర్’లో హాస్య పాత్రలో నవ్వించినా, ‘గణేష్’లో క్రూరమైన మంత్రిగా భయపెట్టినా, ఆయన నటనా చాతుర్యం ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆహా నా పెళ్ళంట’ చిత్రంలో లక్ష్మీపతి పాత్ర ఆయనకు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, హావభావాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారం ఆయనకు అందించారు.