పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర గా నటించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం కలిసి.. ఓజీని హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలిచాయి. అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది.
Also Read:Danayya : ఓజీ టైటిల్ నాగవంశీదే.. ఇచ్చినందుకు థాంక్స్!
ఈ క్రమంలో దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “దాదాపు మూడేళ్ళ ప్రయాణం. మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మా పక్కనే ఉంటూ మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్యకి, కళ్యాణ్ కి కృతఙ్ఞతలు. ఓజీ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కి మొదటగా థాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆయనకు వీరాభిమానిని. జానీ సినిమా సమయం నుంచి పవన్ ని కలిస్తే చాలు అనుకునేది. అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం, దానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు లాంటివారు. వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. ముఖ్యంగా తమన్ అందరికంటే ఎక్కువగా ఈ సినిమాని నమ్మారు.” అన్నారు.