నందమూరి బాలకృష్ణ చిత్రాల విషయంలో హీరోయిన్‌ను ఎంచుకోవడం అనేది దర్శకనిర్మాతలకు ఒక పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఒక పట్టాన హీరోయిన్ ఖరారు కాక, షూటింగ్ 20-30 శాతం పూర్తయినా వెతుకులాట కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ‘అఖండ 2’ తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్‌లో ఒక సీనియర్ నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమే… లేడీ సూపర్ స్టార్ నయనతార! నయనతార నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది.
Also Read :SamanthaRuthPrabhu : శారీలో ఫ్యాన్స్ ను గిలిగింతలు పెడుతున్న సమంత.. ఫొటోస్
ప్రస్తుతం 40 ప్లస్ వయసులోనూ నయనతార అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయికల్లో ఆమె ఒకరు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తున్న నయనతార, ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. నయన్ క్రేజ్‌కి నిదర్శనంగా, ఆమె చేతిలో ప్రస్తుతం దాదాపు 9 సినిమాలు ఉన్నట్లు సమాచారం. అందులో తమిళంలో 4, మలయాళంలో 2, తెలుగులో (చిరు సినిమాతో కలిపి) 2, కన్నడలో 1 సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా నాలుగోసారి బాలయ్యకు జోడీగా నయనతార తెరపై కనిపిస్తే, ఈ హిట్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. గోపీచంద్ మలినేని-బాలయ్య చిత్రం అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.