Mani Ratnam said ‘thanks’ to Rajamouli: మణిరత్నం వంటి దిగ్దర్శకుడు నవతరం మెచ్చిన రాజమౌళి వంటి దర్శకునికి ‘థ్యాంక్స్’ అని చెప్పడం నిజంగా విశేషమే! రాజమౌళి కంటే ముందే మణిరత్నం దేశవ్యాప్తంగానూ, కొన్నిసార్లు అంతర్జాతీయంగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. పైగా ఓ దర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ ఈ నాటికీ సినిమాలు రూపొందిస్తూనే ఉన్నారాయన. మణిరత్నం చిత్రాల్లో నటిస్తే చాలు అదే భాగ్యం అనుకొనేవారు ఉన్నారు. ఆయన సినిమాలకు పనిచేస్తే జన్మధన్యమైనట్టే అని భావించేవారూ లేకపోలేదు. అలాంటి మణిరత్నం మన రాజమౌళికి ‘థ్యాంక్స్’ చెప్పడం, అదీ ఓ వేదికపై చెప్పడమన్నది నిజంగా అభినందనీయమే!
తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డులే రాని సమయంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ బెస్ట్ పిక్చర్ గా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఓ జానపద చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా నిలవడం అన్నది ఓ అద్భుతం! పైగా ‘బాహుబలి’ రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. అదే విషయాన్ని మణిరత్నం తన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’ సినిమా సెకండ్ సింగిల్ ‘చోళ…చోళ…’ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వేదికపై తెలియజేయడం విశేషం! ‘బాహుబలి’ సిరీస్ కారణంగా రాజమౌళి తమలాంటి వారి కోసం ఓ వాకిలి తెరిచారని, అందువల్ల తాము కూడా ‘పొన్నియన్ సెల్వన్’ వంటి పీరియడ్ మూవీని రెండు భాగాల్లో రూపొందించేందుకు ముందడుగు వేశామని మణిరత్నం వివరించారు. ఆయన మాటలు అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నిటిని మించీ మణిరత్నం రాజమౌళి గురించి చెప్పిన పలుకులు తెలుగువారందరినీ పరవశింప చేశాయని చెప్పవచ్చు.