KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా

Ktr

Ktr

Akasamlo Oka Thara: ఇటీవల తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఒక మహిళ అసాధ్యమైన కలలను సాకారం చేసుకునేందుకు చేసే స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించారని తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమాను చూసిన ఆయన, చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపించారు. ఈ మూవీపై ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశానని, సరళమైన కథతో అద్భుతమైన అనుభూతిని అందించారని, ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాత్విక వీరవల్లి తొలి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నారని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్. దర్శకుడు పవన్ సాధినేని పనితీరును కూడా ప్రశంసించారు. ఇలాంటి మంచి సినిమాను అందించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మించారు. కేటీఆర్ ప్రశంసలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.